టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతో అందరికీ తెలిసిందే. స్వదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విరాట్‌కు వీరాభిమానులున్నారు. అతడ కనపడితే చాటు సెల్ఫీలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌లు కోసం జనాలు ఎగబడతారు. అయితే ఈ విషయం ఆసియా కప్ సందర్భంగా మరోసారి రుజువైంది. కోహ్లీతో మాట్లాడేందుకు, అతడు సంతకం చేసిన జెర్సీని పొందేందుకు పాకిస్థాన్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు ఆసక్తిచూపిన విషయం తెలిసిందే. ఇంకొందరు అభిమానులు కోహ్లీని కలిసి అతడితో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. విరాట్ సైతం వారితో స్నేహపూర్వకంగా మెలిగాడు. అభిమానులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చే ఈ మాజీ కెప్టెన్ తాజాగా మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరలవుతోంది.
Watch how Virat Kohli made the day of a young li'l fan🫶@imVkohli #ViratKohli𓃵 pic.twitter.com/hnsnhEAAGw
— iᴍ_Aʀʏᴀɴ18 (@crickohli18) August 30, 2022
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం భారత్, హాంకాంగ్ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత జట్టు స్టేడియంలోకి వెళుతుండగా.. కోహ్లీ వీరాభిమాని అయిన ఓ బాలుడు నిబంధనలు ఉల్లంఘించి అక్కడకు దూసుకొచ్చాడు. అయితే, అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు అతడిని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నాడు. దీన్ని గమనించిన కోహ్లీ.. ఆ బాలుడిని వదిలేయాల్సిందిగా సూచించడంతో సెక్యూరిటీ గార్డు అతడిని విడిచిపెట్టాడు. దీంతో కోహ్లీ వద్దకు పరుగున వెళ్లిన బాలుడు.. తాను ఎంతగానో అభిమానించే అతడి వద్ద ఆటోగ్రాఫ్ తీసుకొని, సెల్ఫీలు దిగి సంబురపడిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీంతో కోహ్లీ చర్య పట్ల అభిమానులు, ఇతరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ ఆ బాలుడి పట్ల విరాట్ ప్రేమగా వ్యవహరించాడని, ఓపిగ్గా ఉన్నాడని ప్రశంసించారు. అందుకే అతడిని ‘కింగ్’ అంటారని మరికొందరు కొనియాడారు.