విశాఖ ఎంపీ అధికారపార్టీలో‌ హాట్ టాపిక్ అయ్యారా

-

ఆయనో ఫస్ట్ టైమ్ ఎంపీ. మిస్టర్ కూల్ ఇమేజ్ ఉన్న ఆయన ఇప్పుడు రూట్ మార్చేశారు. రాజకీయ విమర్శలు వస్తే చీల్చిచెండాడేస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ విశాఖ ప్రజలకు రెండు దశాబ్దాలకు పైగా పరిచయం ఉన్న పేరు. రియల్టర్, సినిమా నిర్మాత. రాజకీయాలతో ఎటువంటి సంబంధంలేని ఎంవీవీ.. సార్వత్రిక ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు. ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆయనలో కనిపిస్తున్న ఆగ్రహం, ఆవేశం అధికారపార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల్లో ఎంవీవీ విజయం నల్లేరుపై నడక కాలేదు. విశాఖ సిటీలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. దీంతో ఎంవీవీకి గట్టిపోటీ తప్పలేదు. ఆయనకు వచ్చిన మెజారటీ 4 వేల ఓట్లే. లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన తొలినాళ్లలో సత్యనారాయణ యాక్టివ్‌గా ఉండేవారు. రాజకీయాలంటే విమర్శలు, దుమ్మెత్తిపోసుకోవడం కాదని భావించేవారట. అయితే రాష్ట్రంలోనే వేగంగా విస్తరిస్తున్న విశాఖకు ఎంపీగా ఉండటంతో ఆయనపై పెద్ద బాధ్యతలు పడ్డాయి. విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు.. ఇలాంటి ఎన్నో అంశాలపై తరచు ఢిల్లీ పెద్దలను కలుస్తుండేవారు. కాకపోతే రాజకీయాల్లో ఉత్సాహం ఒక్కటే సరిపోదని.. దానివెనుక అనేక ఈక్వేషన్లు, కాలిక్యులేషన్లు ఉంటాయనేది గ్రహించడానికి ఎంవీవీకి ఎక్కువ సమయం పట్టలేదు.

కొంతకాలం లౌక్యంగా నెట్టుకొచ్చినా.. ఇప్పుడు ఎంపీ ఎంవీవీపై అనుకోని ఒత్తిడి ఏర్పడింది. అదే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టడంతో కార్మిక సంఘాలు, ప్రజలు రగిలిపోతున్నారు. ఉక్కు పరిరక్షణ కోసం ఉద్యమం ఊపందుకుంటోంది. దీంతో స్థానిక ఎంపీగా కార్మిక సంఘాలు ఆయనపైనే బాధ్యత పెట్టాయి. ఇదే సమయంలో విపక్ష పార్టీలు ఎంవీవీని టార్గెట్ చేశాయి. స్థానిక ఎంపీ గట్టిగా అడ్డుకోకపోవడంవల్లే ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయం కలిగేలా విమర్శలు చేస్తున్నాయి. దీంతో ఎంపీ రూటు మార్చేశారు. సైలెంట్‌గా ఉంటే లాభం లేదనుకున్నారో ఏమో పంచ్‌లు.. కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధమేనని ఆవేశంగా ప్రకటించారు. మాట తప్పను… మడమ తిప్పను అని పెద్ద డైలాగులే పలుకుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఎంవీవీలో ఈ ఫైర్‌కు కారణం ఏంటా అని కొత్తగా చర్చ మొదలైంది.

అసలు సిసలు రాజకీయ నాయకుడిగా మారేందుకు ఎంవీవీ ప్రయత్నిస్తున్నారా.. అని కొందరు ఆరా తీస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాలు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన చేసిన విమర్శలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి ఎంవీవీ సత్యనారాయణ భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి అంచనాలు లేకుండానే ఎంపీ అయ్యారు. అందరు ఎంపీల్లాగానే ఈయన ఒకరు అనే భావన ఉండేది. కానీ, ఇప్పుడు ఎంవీవీ సత్యనారాయణలో రియల్ టైం పొలిటీషియన్ కనిపిస్తున్నాడని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఇందుకు ఆయనకు స్టీల్‌ప్లాంట్ పోరాటం రూపంలో మంచి ప్లాట్ ఫాం దొరికిందనే అభిప్రాయం ఉంది. తనను తాను నాయకుడిగా తీర్చిదిద్దుకోవడానికి.. ఇదే సరైన సమయంగా ఎంపీ భావిస్తున్నారనేది అంతర్గత సమాచారం. రాజకీయంగా ఎదగడానికి.. తనను నమ్ముకున్న జనానికి మేలు చేయడానికి గట్టిగా నిలబడాలనే విధానం ఎంవీవీలో కనిపిస్తోందట. దీంతో అధికార వైసీపీలో ఎంపీ పై హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news