విశాఖ ఉక్కు వైభవం ఇక గత చరిత్ర కానుందా

-

ప్రయిడ్ ఆఫ్ ఇండియా అంటూ గర్వంగా నిలబడ్డ భారీ పరుశ్రమ ప్రయివేట్ పరం కానుంది. స్టీల్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేంద్రం నిర్ణయించింది. 100శాతం వాటాల విక్రయాల ద్వారా స్ట్రాటజిక్ సేల్‍ కు సిద్ధం అవుతుంది. దీంతో కార్మిక సంఘాలు భగ్గు మంటున్నాయి. రాజకీయ పార్టీలు సైతం ఉక్కు సంకల్పం ప్రకటించడంతో మరో ఉద్యమంకు బాటలు పడినట్లయింది.

విశాఖ ఉక్కు…ఈ పేరు చెప్పగానే ఆంధ్రుల పోరాటం గుర్తుకు వస్తుంది. స్ట్రాటజిక్ సేల్ పేరుతో స్టీల్ ప్లాంట్ వాటాలను విక్రయించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ చర్య కార్పొరేట్ కుట్రలో భాగమని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరణ పేరుతో స్టీల్ ప్లాంట్ ను విక్రయించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ కు ఇప్పటికే 3వేల ఎకరాలు కట్ట బెట్టింది. పోరాటాలు,బలిదానాలతో సాధించుకున్న పరిశ్రమను కాపాడుకునేందుకు మరోసారి కార్మికలోకం ఉద్యమానికి సిద్ధం అయింది.

విశాఖ ఉక్కు వైభవం వెనుక 32మంది బలిదానాలు ఉన్నాయి. వందల మంది రైతులు త్యాగాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ను ప్రయివేట్ పరం చేయడం అంటే తమ త్యాగాలను అవమానించడమే అంటున్నారు నిర్వాసితులు. భవిష్యత్ తరాల కోసం చేసిన బలిదానాలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తో గాలిలో కలిసిపోతున్నాయి. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం త్యాగాలు చేసిన కుటుంబాలకు పరిహారం ఇప్పటి కీ అందలేదు. చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి వుంది.

35వేల మందికి ప్రత్యక్షంగానూ…లక్ష మంది పరోక్షంగానూ ఆధారపడ్డ పరిశ్రమ భవిష్యత్తుపై కార్మిక వర్గాల్లో అలజడి మొదలైంది. కోవిడ్ తర్వాత స్టీల్ ప్లాంట్ ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. నికర లాభాలను ఆర్జించేందుకు అడుగులు వేస్తోంది. దేశంలో సొంత గనులు లేని ఏకైక భారీ ఉక్కు పరిశ్రమ విశాఖ స్టీల్ ఒక్కటే. దీంతో ఇనుప ఖనిజం, థర్మల్, కోకింగ్ కోల్ బ్లాక్ ల కోసం ఒడిషా మినరల్ డవలప్ మెంట్ కార్పోరేషన్‍, బిస్రా స్టోన్ లైమ్ కంపెనీలపై ఆధారపడుతోంది. మార్కెట్ రేట్లకు అనుగుణంగా బయటి నుంచి ముడిసరుకును కొనుగోలు చేయడంతో విక్రయించే ప్రతి టన్ను స్టీలుపైన ఐదు వేల రూపాయలు కోల్పోవాల్సి వస్తోంది. తద్వారా సంస్ధపై ఏటా మూడు వేల కోట్ల రూపాయల భారం పడుతోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపించినప్పుడు సుమారు 22 వేల ఎకరాలు భూమిని సేకరించారు. తొలినాళ్లలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నా స్టీల్ ప్లాంట్ వాటన్నింటిని అధిగమించి 2002 సంవత్సరం నుంచి 2015 వరకు వేల కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో కేంద్రానికి చెల్లించింది. అలాంటి బంగారుబాతు లాంటి కర్మాగారం 2015-2018 వరకు మూడేళ్లపాటు నష్టాలపాలైంది.అయితే ఈ నష్టాలకు రాజకీయ నాయకులే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు.

అయితే విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన పరిశ్రమ ఇప్పుడు ప్రయివేటీకరణకు సిద్ధం అవ్వడంతో మరోసారి కార్మికులు రోడ్డెక్కా రు. వీరికి రాజకీయపార్టీలు మద్దతు ప్రకటించాయి. అధికారం ప్రతిపక్షం అన్న తేడా లేదు అవసరమైతే రాజీనామాలకు సిద్ధం అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news