ఉత్తరాంధ్రలో ఈ నేతలంతా పల్లెపోరులో చెతులెత్తేశారా

-

ఏపీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఉత్తరాంధ్రలో కొత్త చర్చని తీసుకొచ్చాయి. సత్తా చూపిస్తామని సవాల్ విసిరిన నేతలంతా సొంత గ్రామాల్లోనే చేతులెత్తేశారు. ఎన్నికల్లో ఓటమి నుంచి కొందరు గుణపాఠాలు నేర్చుకుంటారు. ఉత్తరాంధ్రలో కొందరు టీడీపీ సీనియర్ల తీరు మాత్రం మారడం లేదు. విజయనగరం జిల్లా టీడీపీ శ్రేణుల్లో ఆ సీనియర్ల పై హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.


ఎక్కడ లెక్క తప్పిందో.. ఎక్కడ పొరపాట్లు జరిగాయో తెలుసుకుని జాగ్రత్త పడతారు. విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్‌ టీడీపీ నాయకులు మాత్రం దీనికి భిన్నంగా వెళ్తున్నారట. నియోజకవర్గాలలో ఆధిపత్యపోరు, వర్గ విభేదాలకే ప్రాధాన్యం ఇస్తూ.. కేడర్‌తోనూ సమన్వయం చేసుకోవడం లేదట. పార్టీ పరంగా పెద్ద పెద్ద పదవులు ఉన్నా.. అవి పేరు వెనక రాసుకోవడానికి తప్ప.. ఎన్నికల వ్యూహం అమలులో అక్కరకు రావడం లేదన్న విమర్శ టీడీపీలోనే వినిపిస్తోంది.

విజయనగరం జిల్లా నుంచి కేంద్రమంత్రులుగా పనిచేసిన అశోక్‌ గజపతిరాజు, కిశోర్‌ చంద్రదేవ్‌, రాష్ట్ర మంత్రిగా చేసిన సుజయ్‌కృష్ణ రంగారావు, సీనియర్‌ నేతలు పతివాడ నారాయణస్వామి, కోళ్ల లలితకుమారి వంటి సీనియర్లు టీడీపీలో ఉన్నారు. కానీ.. 2019 ఎన్నికల్లో వీరందరికీ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. నేతల ఊహకు అందని విధంగా ఓటర్లు తీర్పు ఇచ్చారు. దగ్గర దగ్గర రెండేళ్లు గడిచిపోయింది. ఇప్పటికైనా ఆ ఓటమి భారం నుంచి బయటకొచ్చి.. కొత్త వ్యూహ రచన ఏదైనా చేస్తున్నారా అంటే లేదని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. దీనికి పంచాయతీ ఎన్నికలనే ఉదాహరణగా వెల్లడిస్తున్నారు.

జిల్లాలో మొదటి విడతగా పార్వతీపురం డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. సీనియర్లు ఉన్న నియోజకవర్గాల్లోనే టీడీపీ మద్దతుదారులకు పరాభవం తప్పలేదు. బొబ్బిలి నియోజకవర్గంలో.. బొబ్బిలి రాజ వారసుడు, టీడీపీ ఇంఛార్జ్‌ బేబినాయన ఒక్కరే కాస్త ఫర్వాలేదని అనిపించారు. 110 సర్పంచ్‌ స్థానాలు బొబ్బిలిలో ఉంటే..40కిపైగా గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులను గెలిపించుకున్నారు. కురుపాం, సాలూరు, పార్వతిపురం నియోజకవర్గాల్లో మాత్రం ఫలితాలు చాలా దారుణంగా ఉన్నాయి.

పార్వతీపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు సొంత ఊరు కృష్ణాపురంలో టీడీపీ మద్దతుదారు ఓడిపోయారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తన సొంత గ్రామం కవిరిపల్లిలో సైతం తెలుగుదేశానికి ఎదురుదెబ్బే తగిలింది. కురుపాం, చినమేరంగి రాజులు ఒక్కటైనా కురుపాంలోనూ అదే పరిస్థితి. అభ్యర్థుల తమవారే అని ప్రకటించినా.. వారి తరఫున ప్రచారం చేయలేదు నాయకులు. మామ-కోడలి ఫైట్‌గా మారిన చినమేరంగిలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణే పైచేయి సాధించారు.

పల్లెపోరులో ఓటములపై టీడీపీలో అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. పదవులు అనుభవించిన వారు కేడర్‌ను పట్టించుకోకపోతే ఇంతకంటే మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయని కొందరు ప్రశ్నిస్తున్నారట. ఇంట గెలిచి రచ్చ గెలిస్తే బాగుండేదని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news