అయ్యన్న అలా…జోగి ఇలా…రొచ్చు రాజకీయం…

ఏపీలో రాజకీయాలు మరీ దరిద్రంగా తయారైనట్లు కనిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు దారుణమైన రాజకీయాలు చేస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయాల్లో నేతలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో విమర్శల దాడి మరింతగా పెరిగింది. నాయకులు బూతులు మాట్లాడలేనిదే ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టి‌డి‌పి నేతలు అదే పనిలో ఉంటున్నారు.

ఎవరికి వారు నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఆ నాయకుడు, ఈ నాయకుడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అదే పనిలో ఉంటున్నారు. తాజాగా టి‌డి‌పి సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు…సి‌ఎం జగన్‌ని ఉద్దేశించి దారుణంగా విమర్శించారు. వాడు-వీడు అంటూ ఇంకా రాయలేని బాషలో తిట్టారు. పరుష పదజాలం వాడుతూ ఒక సి‌ఎంని తిట్టారు. అలాగే హోమ్ మంత్రిని ఉద్దేశించి కూడా తీవ్రమైన విమర్శలు చేశారు.

ఇక అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్..చంద్రబాబు ఇంటికెళ్ళి మరీ నిరసన తెలియజేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ కర్రలు, రాళ్ళు పట్టుకుని రచ్చ చేస్తే అది నిరసన అవ్వదు. అయితే ఈ విషయంలో అయ్యన్నపై చట్ట పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ జోగి రాజకీయంగా రచ్చ లేపడానికి చూసినట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

అలా అని జోగి రమేష్ ఏమి మంచి విమర్శలు ఏమి చేయలేదని, గతంలో జోగి కూడా హద్దులు దాటి చంద్రబాబుని దూషించిన సందర్భాలు ఉన్నాయని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. జోగి రమేష్ మాత్రమే కాదు చాలామంది వైసీపీ నేతలు, చంద్రబాబుని ఉద్దేశించి అనేక రకాలుగా తిట్టారని, అప్పుడు జగన్ ఇంటికెళ్ళి క్షమాపణ చెప్పాలని తాము నిరసన తెలియజేయలేదని అంటున్నారు. ఏదేమైనా రెండు పార్టీల నాయకులు హద్దులు దాటి మాట్లాడుకుంటూ..రొచ్చు రాజకీయాలు చేస్తున్నారని న్యూట్రల్ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.