కరోనా వైరస్‌పై మరింత దృఢ సంకల్పంతో పోరాటం చేస్తూ ముందుకు సాగాలని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందిపై ప్రభావం చూపించిందన్నారు. కేవలం ఒకే ఒక్క వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని అన్నారు. మానవత్వానికి ఇది ఒక పెద్ద సవాల్ విసిరిందని అన్నారు. ఇకపై కరోనాను అడ్డుకునేందుకు మరింత గట్టిగా పోరాటం చేయాలన్నారు.
మన ప్రాణాల్ని మనం కాపాడుకుంటూ కరోనాపై పోరాటం చేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. గత 4 నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని, ప్రపంచమంతా ఈ వైరస్‌పై పోరాటం చేస్తుందని అన్నారు. 21వ శతాబ్దం భారతీయులదేనని తెలిపారు. కరోనా వైరస్ ఆరంభంలో భారత్ నిత్యం పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులను తయారు చేసే స్టేజిలో లేదని, కానీ ఇప్పుడు నిత్యం 2 లక్షల పీపీఈ కిట్లు, 2 లక్షల 95 మాస్కులను భారత్ తయారు చేస్తుందని తెలిపారు. కరోనాపై మనం గెలిచి తీరాలన్నారు.
ప్రస్తుతం చాలా కీలకదశలో ఉన్నామని, స్వీయ రక్షణ పాటిస్తూ ముందుకు సాగాలని, కరోనాపై పోరాటం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచానికి భారత్ యోగాను పరిచయం చేసిందన్నారు. కరోనా సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పదన్నారు. భారత ఔషధాలు ప్రపంచానికి వరంగా మారనున్నాయన్నారు. భారత్ సామర్థ్యాన్ని ప్రపంచం నమ్ముతుందన్నారు. భారత్ అభివృద్ధి వైపు మళ్లీ పయనిస్తుందన్నారు.
2000వ సంవత్సరంలో వచ్చిన వై2కె సమస్య నుంచి భారత్ ప్రపంచాన్ని గట్టెక్కించిందని మోదీ అన్నారు. నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు. ప్రపంచం మొత్తాన్ని భారత్ వసుదైక కుటుంబంగా చూస్తుందన్నారు.