బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని గత కొంత కాలంగా బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయి. ఇటీవల సల్మాన్‌కు అత్యంత ఆత్మీయుడైన బాంద్రా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా.. ఆరు రౌండ్ల కాల్పులు జరిపి హత్యచేసిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్‌కు ఎవరు సహాయం చేసినా వారికి ఇదే గతి పడుతుందని ఆ గ్యాంగ్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించింది.
ఈ క్రమంలోనే ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ ద్వారా మరో బెదిరింపు మెసేజ్ వచ్చింది. రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్‌ను చంపేస్తామని కొందరు దుండగులు వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్‌ను తేలిగ్గా తీసుకోవద్దని కూడా హెచ్చరించారు. బిష్ణోయ్‌తో శతృత్వం ఆగాలన్నా, సల్మాన్ బతికుండాలన్నా రూ.5 కోట్లు ఇవ్వాల్సిందేనని స్పష్టంచేశారు. దీంతో సల్మాన్ ఖాన్‌కు ఇంటి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బెదిరింపు మెసేజ్‌తో ముంబై పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు.