కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గాను ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే జనాలు తమకు అనువుగా ఉండే మాస్కులను ధరిస్తున్నారు. అయితే కారు లేదా టూవీలర్, సైకిల్ ఇలా ఏ వాహనాన్ని అయినా డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక్కరమే ఉంటే మాస్కులను ధరించాలా, లేదా అన్న విషయంపై చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. దీనికి కేంద్రం తాజాగా సమాధానం ఇచ్చింది.
కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రెటరీ రాజేష్ భూషణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వాహనాలను డ్రైవింగ్ చేసేవారు ఒక్కరే ఉంటే, వారితో ఇతర ఏ ప్రయాణికులూ లేకుంటే.. మాస్కులను ధరించాలా, వద్దా అన్న విషయంపై ఇంకా కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదని అన్నారు. అందువల్ల వాహనదారుడు ఒక్కడే ఉంటే మాస్కులను ధరించడం, ధరించకపోవడం అన్నది స్వవిషయమని అన్నారు.
అయితే కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులను కచ్చితంగా ధరించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరి అని అన్నారు.