మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అనేక సార్లు ప్రభుత్వాలు మారాయి. కానీ నరేంద్ర మోదీ హయాంలోనే ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అనేక సార్లు ప్రభుత్వాలు మారాయి. కానీ నరేంద్ర మోదీ హయాంలోనే ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. పేదల అభివృద్ధి కోసం, యువతకు, మహిళలకు, చిరు వ్యాపారవేత్తలకు, ఔత్సాహికులకు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు కావల్సిన సంక్షేమ పథకాలను మోదీ అందుబాటులోకి తెచ్చారు. వాటి ద్వారా నేడు దేశంలోని ఎంతో మంది ప్రజలు సంక్షేమ ఫలాలను పొందుతున్నారు. మోదీ హయాంలో అమలులోకి వచ్చిన సంక్షేమ పథకాల జాబితాను ఒకసారి పరిశీలిస్తే…
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీం
ఈ స్కీం ద్వారా దేశంలో ఉన్న నిరుపేద రైతులకు ఏటా రూ.6వేల ఆర్థిక సహాయాన్ని పెట్టుబడి కోసం తడవకు రూ.2వేల చొప్పున మొత్తం 3 విడతల్లో చెల్లిస్తున్నారు. ఆ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ పథకంతో దేశంలోని 14.5 కోట్ల మంది రైతులకు లబ్ధి అందుతోంది.
ప్రధాన మంత్రి కిసాన్ పెన్షన్ యోజన
మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన రైతులకు నెలకు రూ.3వేల పెన్షన్ అందుతుంది. దీనికిగాను కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.10,774 కోట్లను ఖర్చు చేయనుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల రైతులు ఈ స్కీంలో పాల్గొనవచ్చు. ఒకవేళ రైతు చనిపోతే అతని కుటుంబంలో ఒకరికి పెన్షన్ మొత్తంలో సగం అందుతుంది.
మెగా పెన్షన్ స్కీం
వ్యాపారులు, దుకాణదారులు, స్వయం ఉపాధి చేసుకునే వారికి, జీఎస్‌టీ రూ.1.50 కోట్ల కన్నా తక్కువ చెల్లించే వారికి ఈ పథకం కింద నెలకు రూ.3వేల పెన్షన్ ఇస్తారు. 60 సంవత్సరాలు నిండిన ఈ వర్గాలకు చెందిన వారికి నెలకు ఆ మొత్తం పెన్షన్ ఇస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న సుమారుగా 3 కోట్ల మంది చిరు వ్యాపారులు, దుకాణదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి దక్కనుంది.
జల్ శక్తి మినిస్ట్రీ
2024వ సంవత్సరం వరకు దేశంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని ఇవ్వాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.
జన్ ధన్ యోజన
దేశంలోని ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలు అందాలన్న ఉద్దేశ్యంతో మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద కార్పొరేట్ బ్యాంకుల్లోనూ పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఎలాంటి మినిమం బ్యాలెన్స్ అవసరం లేకుండానే జన్ ధన్ ఖాతా తెరవచ్చ.
స్కిల్ ఇండియా
దేశంలోని పారిశ్రామిక, ఇతర రంగాల్లో పనిచేసే యువత నైపుణ్యాలను మరింత పెంచేందుకు నేషనల్ స్కిల్ డెవపల్‌మెంట్ మిషన్ కింద యువతకు శిక్షణనిస్తారు. దీంతో వారికి ఉపాధి అవకాశాలు కూడా మరింతగా పెరుగుతాయి.
మేకిన్ ఇండియా
దేశంలో ఉత్పాదకతను పెంపొదించడంతోపాటు స్థానిక యువతకు ఉద్యోగాలు లభించేలా పెద్ద మొత్తంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలు కూడా అందించేందుకు గాను, దేశంలోనే వారు ఆయా ఉత్పత్తులను తయారు చేసేందుకు గాను మోదీ మేకిన్ ఇండియా క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. దీని వల్ల మేడిన్ ఇండియా అన్న ముద్ర ప్రపంచ దేశాల మార్కెట్‌లో కనిపిస్తుంది.
సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన
దేశంలో ఉన్న అన్ని గ్రామాలను పట్టణాలు, నగరాలకు సమాంతరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్
దేశంలో ఉన్న ప్రజలకు 60 ఏళ్లు దాటాక నెలకు రూ.3వేల పెన్షన్ అందించే స్కీం ఇది. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. ఒక వేళ ఆ వ్యక్తి చనిపోతే అతని కుటుంబంలో ఒకరికి నెలకు అందే పెన్షన్‌లో సగం ఇస్తారు.
బేటీ బచావో బేటీ పఢావో
దేశంలో ఉన్న బాలికలను కచ్చితంగా చదివించాలని, వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
హృద్య ప్లాన్
పురాతన కట్టడాలు, చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించడం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ప్రధాన మంత్రి ముద్ర యోజన
దేశంలో ఉన్న సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారులకు, ఔత్సాహికులకు ఎలాంటి తాకట్టు అవసరం లేకుండా రూ.10 లక్షల వరకు వ్యాపార రుణం అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఉజల యోజన
దేశంలో ఉన్న పేదలకు సబ్సిడీ కింద ఎల్ఈడీ బల్బులను అందించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
అటల్ పెన్షన్ యోజన
అసంఘటిత రంగానికి చెందిన కార్మికులకు పెన్షన్ అందించే పథకం ఇది.
ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన
18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సున్న వారికి అందిస్తున్న బీమా పథకం.
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన
దేశంలో ఉన్న ప్రజలందరికీ బీమా ఉండాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని మోదీ ప్రారంభించారు.
అమృత ప్లాన్
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కావల్సిన కనీస వసతులను కచ్చితంగా కల్పించాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.
డిజిటల్ ఇండియా మిషన్
దేశంలో ఉన్న ప్రజలందరూ డిజిటల్ నాలెడ్జి (కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వాడే పరిజ్ఞానం) కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
స్టాండప్ ఇండియా
దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ప్రజలకు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఆర్థిక సహకారం అందించేందుకు ప్రవేశపెట్టిన స్కీం ఇది.
ప్రధాన మంత్రి ఉజ్వల
ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా ఉన్న పేదలకు ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్లను అందిస్తున్నారు.
నమామి గంగా యోజన
గంగానదిలో ఉన్న కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించి ఆ నదిని స్వచ్ఛంగా తయారు చేయడం కోసం మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మోదీ ప్రధాని అయ్యాక పైన చెప్పినవే కాకుండా ఇంకా అనేక పథకాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. వాటి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు.