గత కొద్ది కాలంగా టీడీపీ యువ నేత లోకేశ్ బాబు (అలియాస్ చినబాబు) ఎక్కడా కనిపించడం లేదు.ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పేరు పెద్దగా వినిపించడం లేదు. అదేవిధంగా మీడియా మీట్లకు కూడా రావడం లేదు. ప్రస్తుతం టీడీపీ కష్టకాలంలో ఉంది. పెద్దగా ప్రజల్లో గుర్తింపు కూడా లేకుండా ఉంది. పార్టీ కూడా ఇవాళ మనుగడ పరంగా నానా పాట్లు పడుతోంది. ఈ దశలో కొత్తగా జీవం పోసుకునేందుకు, కొత్త ఉత్సాహం నింపుకునేందుకు లోకేశ్ చేయాల్సింది ఎంతో! కానీ ఆయన చేయడం లేదు. సాధించాల్సింది ఎంతో కానీ ఆయన సాధించడం లేదు.
ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కూడా లోకేశ్ ఏమీ మాట్లాడలేదు. బాలయ్య మాట్లాడినంత కూడా మాట్లాడలేదు. కొత్త బడ్జెట్ (యూనియన్ బడ్జెట్)లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్నీ ఆయన ప్రశ్నించలేదు. ప్రత్యేక జోన్ (రైల్వే జోన్) ఏర్పాటుకు సంబంధించి కూడా ఆయన ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. ఇదే సమయంలో ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రం దాగుడు మూతలు ఆడుతున్నా కూడా ఆయన పట్టించుకోలేదు.
ముఖ్యంగా రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి.రోడ్ల దుర్భరావస్థలో ఉన్నాయి. వాటి బాగుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకా అభివృద్ధి పనులు ఎక్కడా అమలులో లేవు.సంక్షేమం పేరిట రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. సాగునీటి ప్రాజెక్టుల విషయమై కూడా అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఏ పట్టింపూ లేకుండా ఉన్నాయి.
వీటితో పాటు ఇంకా అనేక సమస్యలు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయి. ప్రధానంగా ఉగాది నుంచి మొదలు అయ్యే కొత్త జిల్లాలపై టీడీపీ ఉద్యమించాల్సి ఉంది. కానీ అస్సలు మాట్లాడడమే లేదు. ఏం చేసినా చంద్రబాబు మాత్రమే అంతా చేయాలి అన్న రీతిలో ఉంది. కానీ మిగతా వారెవ్వరూ పెద్దగా స్పందించిన దాఖలాలే లేవు. దీంతో ఉత్తరాంధ్రతో సహా అన్నివెనుకబడిన ప్రాంతాలలోనూ పార్టీ మరింత వెనుకబడిపోతోంది.