ఎర్రజెండా రాష్ట్రం.. కాషాయ రంగు పులుముకోనుందా..?

బెంగాల్ రాజకీయాల్లో గెలుపోటముల్ని నేతలు పంతాలు, పట్టింపుల స్థాయిలో తీసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత మమతా బెనర్జీ కూడా జై శ్రీరాం అంటారని అమిత్ షా చెబుతుంటే.. జై కాళీ నినాదంతో బదులిస్తామంటున్నారు మమత. నేతాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన రాజకీయం కూడా హాట్ టాపిక్ అయింది. కొత్తగా మైనార్టీల ఓట్ల చీలిక కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. బెంగాల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో ఎర్రజెండా రాష్ట్రంలో కాషాయ రంగు పులుముకోనుందా చర్చ ఊపందుకుంది.

రాజకీయ చదరంగంలో బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బెంగాల్ ఎన్నికల్లో గెలుపు ఖాయం చేసుకోవాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బీజేపీపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇక.. బీజేపీ కూడా అంతే. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ తృణమూల్ ను ఏకి పారేయాలని నిర్ణయించుకుంది. ఈ ఇద్దరి పంతాలతో బెంగాల్ రాజకీయమే మారిపోయింది. కొన్ని సంవత్సరాల పాటు బెంగాల్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన వామపక్షాలు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాయి. బెంగాల్ చదరంగం వామపక్షాలు లేని చదరంగంగా మారిపోయింది.

ఇటు తృణమూల్‌లో గాని, అటు బీజేపీలో గాని యువ నాయకత్వమంటూ ఎవరూ లేరు. అటు వామపక్షాల్లోనూ లేరు. కానీ..రాజకీయ పరుగులో మాత్రం వామపక్షాలు వెనక్కి పడిపోయాయి. కొన్ని రోజుల క్రితం వరకూ బీజేపీ పునాదులు కూడా బలంగా ఏమీ లేవు. ఎప్పుడైతే మోదీ, షా ద్వయం ప్రవేశించిందో.. అప్పట్నుంచీ బెంగాల్‌ను ఓ ఉడుంపట్టు పడుతున్నారు. బెంగాల్ ఎన్నికల్లో గెలుపు కోసం తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య వీధిపోరాటాలు జరుగుతున్నాయి. అగ్రనేతల పోటాపోటీ ర్యాలీలు ఉద్రిక్తతల్ని మరింత పెంచుతున్నాయి. దాడులతో లెఫ్ట్ క్యాడర్ ని నామరూపాల్లేకుండా చేసిన టీఎంసీ.. ఇప్పుడు బీజేపీపై అదే అస్త్రం ప్రయోగిస్తోందని కాషాయ పార్టీ మండిపడుతోంది.

ఎట్టి పరిస్థితుల్లో మమతను గద్దె దించుతామని అమిత్ షా ఇప్పటికే పలు సభల్లో చెప్పారు. ఎన్నికల తర్వాత దీదీ కూడా జై శ్రీరాం నినాదం చేయక తప్పదని చురకలు అంటించారు. బెంగాల్లో మార్పు వస్తేనే మమతలో మార్పు వస్తుందని మోడీ కూడా విమర్శల బాణాలు విసిరారు. అయితే బెంగాల్ కు బయటి వ్యక్తులు అవసరం లేదని మమత చెబుతున్నారు. బెంగాలీలలను ఇక్కడి వ్యక్తులే పరిపాలించాలని లోకల్ సెంటిమెంట్ లేవదీస్తున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం నేతాజీ జయంతిని కూడా రెండు పార్టీలు పోటాపోటీగా నిర్వహించాయి. కేంద్రం పరాక్రమ్ దివస్ గా ప్రకటిస్తే.. మమత దేశ్ నాయక్ దివస్ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. నేతాజీ వారసత్వం కోసం కూడా రెండు పార్టీలు పోటీపడుతున్నాయి.

ఇతర పార్టీల నుంచి బలంగా ఉన్న నేతలను బీజేపీలోకి ఆకర్షిస్తున్నారు అమిత్ షా. ముఖ్యంగా అధికార తృణమూల్‌ను టార్గెట్ గా చేసుకొనే షా పావులు కదుపుతున్నారు. ఈ వ్యూహం ముకుల్ రాయ్ నుంచి ప్రారంభమై..సువేందు అధికారి, రాజీవ్ బెనర్జీ వరకు కొనసాగుతోంది.ముకుల్ రాయ్ సంస్థాగతంగా బలమైన నేత. ఇంతకు పూర్వం తృణమూల్ లో ఉండేవారు. శారదా స్కామ్ తెరపైకి వచ్చిన సందర్భంలో ఆయన హఠాత్తుగా బీజేపీకి మారారు. అప్పటి నుంచి బీజేపీని విస్తరించే పనిలో సైలెంట్ గా వ్యూహాలు వేస్తున్నారు.

ఇక సువేందు అధికారి. బలమైన నేపథ్యమున్న నేత. సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. నందిగ్రామ్ లో సెజ్‌లకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపిన నేత. సెజ్‌లకు వ్యతిరేకంగా సీపీఎంను ఏకిపారేయడంలో సువేందుదే కీలక పాత్ర. కొన్ని సంవత్సరాల పాటు పాతుకుపోయిన వామపక్షాలను కూకటి వేళ్లతో పెకిలించి, సీఎం మమతను సీఎం కుర్చీపై కూర్చోబెట్టిన సర్వ సమర్థుడు. దాదాపు 50 నియోజకవర్గాలపై అశేష పట్టు సాధించిన అసమాన నేత. అంతటి నేతను బీజేపీ లాగేసుకుంది.

ఇలా ఇతర పార్టీల్లో బలమైన నేతలను బీజేపీలోకి ఆహ్వానించి..బీజేపీని అధికార పీఠానికి దగ్గర చేయాలని షా వ్యూహాలు వేస్తున్నారు. మరి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎంత మేర సక్సెస్ అవుతారో చూడాలి.