ఐపీఎల్ 14వ సీజన్‌లో హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంను ఒక వేదికగా చేర్చాలని మంత్రి కేటీఆర్.. బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులను కోరారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. కొవిడ్-19 నియంత్రణలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల కన్నా హైదరాబాద్ ముందుందని చెప్పారు. దీంతో ముంబైలో కరోనా అదుపుకాకుంటే, ఆఛాన్స్ భాగ్యనగరానికే దక్కనుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ మ్యాచ్‌లు ఉప్పల్‌లో నిర్వహించేందుకు అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు కేటీఆర్. గతేడాది కరోనా కారణంగా దుబాయ్‌లో, కఠిన ఆంక్షల నడుమ ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరీ బీసీసీఐ.. ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించింది. అయితే, ఈసారి స్వదేశంలోనే ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి.
మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఆరు ప్రధాన నగరాలను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ జాబితాలో చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ నగరాల పేర్లు ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ముంబయిని మరో వేదికగా ఎంపిక చేసే వీలుంది. ఒకవేళ అక్కడ మ్యాచ్‌లు నిర్వహించడానికి అనుకూలంగా లేకపోతే …హైదరాబాద్‌కు అవకాశం దక్కే అవకాశముంది.