పశ్చిమ బెంగాల్లో దీదీ హవా కొనసాగింది. త్రుణమూల్ కాంగ్రెస్ నాలుగు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. రికార్డ్ స్థాయిలో మెజారిటీ సాధించి బీజేపీని మట్టి కరిపించింది. దీంతో టీఎంసీ శ్రేణులు బెంగాల్ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయం ’ప్రజల విజయం‘ గా మమతా బెనర్జీ అభివర్ణించారు. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు, బెంగాల్ ప్రజలు విద్వేశ రాజకీయాలను ఓడించారని, బెంగాల్ ఎప్పుడూ అభివ్రుద్దిని, ఐక్యతను ఎంచుకుంటుందని, ప్రజల ఆశీర్వాదంతో బెంగాల్ రాష్ట్రాన్ని ఉన్నతంగా ఉంచుతామని ట్విట్టర్ వేదికగా మమతా బెనర్జీ స్పందించారు. ప్రస్తుతం దిన్హటా, ఖర్దా, శాంతిపూర్, గోసబా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు భారీ మెజారిటీలో గెలుపొందారు. దిన్హటా నుంచి ఉదయన్ గుహా 1.6 లక్షల ఓట్ల తేడాతో, ఖర్ధాలో సోవాందేబ్ ఛటోపాధ్యాయ 93 వేల తేడాతో గెలుపొందారు. మరోవైపు గోసబా, శాంతిపూర్ నియోజకర్గాల్లో టీెఎంసీ అభ్యర్థులు లక్షకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందే అవకాశం ఉంది.