ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న కాశ్మీర్ సమస్యకు భారత ప్రభుత్వం ఎట్టకేలకు పరిష్కారం చూపింది. ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది.
ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న కాశ్మీర్ సమస్యకు భారత ప్రభుత్వం ఎట్టకేలకు పరిష్కారం చూపింది. ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఈ విషయంపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక రాజ్యసభలో జమ్మూకాశ్మీర్ విభజన బిల్లును కూడా ఆమోదించారు. ఈ క్రమంలో లోక్‌సభలో మంగళవారం బిల్లు ఆమోదం పొందితే చాలు. అయితే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఆర్టికల్ 370 రద్దుతో ఇప్పటి వరకు రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుంది. ఢిల్లీ, పుదుచ్చేరి తరహాలో జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. దీనిపై కేంద్రానికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
* దేశానికి సంబంధించి పార్లమెంట్‌లో చేసే ఏ చట్టమైనా సరే.. ఇకపై జమ్మూ కాశ్మీర్‌లోనూ అమలవుతుంది.
* జమ్మూకాశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు లెఫ్టినెంట్ గవర్నర్ల ఆధీనంలోకి వస్తాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అంతిమ పాలనాధికారం ఉంటుంది.
* జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి ప్రతి అంశంలోనూ కేంద్ర హోం శాఖకు విశేషమైన అధికారులు ఉంటాయి.
* జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఉన్నా అది ఢిల్లీలాగే ఉంటుంది. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగం, భూముల నిర్వహణ తదితర అంశాలపై అధికారాలు ఉండవు.
* జమ్మూకాశ్మీర్‌లో ఉండే స్థిర నివాసులకు మాత్రమే ఇప్పటి వరకు అక్కడ భూముల క్రయ విక్రయాలను జరిపే హక్కు ఉండేది. కానీ ఇప్పుడు దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన ప్రజలైనా అక్కడ భూములను కొనవచ్చు, అమ్మవచ్చు.
* లదాఖ్ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండవు. కానీ ఆ ప్రాంత ప్రజలు లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రం తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటారు.
* జమ్మూకాశ్మీర్‌కు, లదాఖ్‌కు ఇకపై నేరుగా సంబంధాలు ఉండవు. లదాఖ్ ప్రాంత అభివృద్ధిని కేంద్రం చూసుకుంటుంది.
* ఇప్పటి వరకు జమ్మూకాశ్మీర్‌కు జాతీయ పతాకం వేరేగా ఉండేది. కానీ ఇకపై ఉండదు. అయితే ఇప్పటికీ జాతీయ పతాకం కావాలంటే.. అందుకు పార్లమెంట్ అనుమతి తప్పనిసరి.