ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు సమావేశమవుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న జగన్ నేరుగా ప్రగతి భవన్ కి వెళ్లి కెసిఆర్ తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆయన కెసిఆర్ కు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి, పలు కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉంది. తాను చేసిన మూడు రాజధానుల ప్రకటనపై జగన్, కెసిఆర్ తో చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఇక గోదావరి, కృష్ణా జలాల విషయంలో ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే వీరి మధ్య కీలకమైన ఎన్నార్సి, క్యాబ్ బిల్లుల విషయంలో చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ రెండు బిల్లులను కేంద్ర౦ అమలు చేస్తామని చెప్పగా ఇరువురు ముఖ్యమంత్రులు కూడా అభ్యంతరం తెలిపారు. ఆ చట్టాన్ని అమలు చేసేది లేదని చెప్పారు.
హైదరాబాద్ లో ముస్లింలు కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాలు కూడా చేస్తున్నారు. కడప జిల్లా పర్యటనలో జగన్ కూడా అమలు చేసేది లేదని చెప్పారు. ఇద్దరు కేంద్రానికి దగ్గరగానే ఉన్నారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కెసిఆర్ ఇప్పటికే తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పగా, జగన్ కెసిఆర్ అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో కెసిఆర్ సూచనలతో ముందుకి వెళ్లాలని భావిస్తున్నారు జగన్.