దేశంలో క‌రోనా కేసులు ‘సున్నా’ అయితే..? ప‌రిస్థితులు ఎలా ఉంటాయి..?

-

దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లంద‌రూ ఇప్పుడు ఎదురు చూస్తున్న‌ది.. ఒక్క రోజు గురించే.. క‌రోనా వైర‌స్ పూర్తిగా మాయ‌మయ్యే రోజు.. కరోనా బారిన ప‌డ్డవారంద‌రూ కోలుకుని ఇళ్లకు డిశ్చార్జి అయిన వేళ‌.. క‌రోనా రోగుల సంఖ్య ‘సున్నా (0)’ అయిన వేళ‌.. కొత్త‌గా క‌రోనా కేసులు న‌మోదు కాని రోజు.. అదే.. ఆ రోజు కోస‌మే మ‌న‌మంద‌రం ఎదురు చూస్తున్న‌ది.. అయితే కొద్ది రోజులు ముందో, వెనుకో.. ఆ రోజు రాక త‌ప్ప‌దు.. కరోనా మ‌హమ్మారి ఎల్ల‌కాలం ఉండ‌లేదు. ఇప్ప‌టికే మ‌నం ఎన్నో మ‌హ‌మ్మారి వ్యాధుల‌పై విజ‌యం సాధించాం. అందువ‌ల్ల కొంత ఆల‌స్య‌మైనా.. క‌రోనాపై మ‌నం గెల‌వ‌డం ఖాయం.. అయితే క‌రోనా మ‌న దేశం నుంచి పూర్తిగా మాయ‌మైతే.. అప్పుడు దేశంలో ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయి..? ప‌్ర‌జ‌ల స్పంద‌న ఎలా ఉంటుంది..? వారి జీవ‌న విధానం ఎలా కొన‌సాగుతుంది..? ప్ర‌జ‌ల్లో ఏమైనా మార్పులు వ‌స్తాయా..? అన్న అంశాల‌ను ఒక్క‌సారి విశ్లేషిస్తే…

what happens if corona cases in india reach to zero

క‌రోనా వ‌ల్ల మ‌న దేశంలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలాయి. క‌నుక ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు అన్ని దేశాల‌తోపాటు మ‌న దేశానికి చాలా సంవ‌త్సరాల టైమే ప‌డుతుంది. క‌రోనా వ‌ల్ల మ‌న దేశం మ‌రో 25 ఏళ్లు వెన‌క్కి వెళ్తుంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. క‌నుక మ‌న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఇక ఇప్పుడ‌ప్పుడే కోలుకుంటుంద‌ని చెప్ప‌లేం. కానీ దీని వల్ల ఎన్నో రంగాల‌కు, ఎంతో మందికి ప్ర‌స్తుతం తీవ్ర‌మైన న‌ష్టం క‌లుగుతుంద‌న్న మాట వాస్త‌వం. దేశంలో ఎంతో మంది ఉద్యోగాల‌ను కోల్పోతారు. తీవ్ర‌మైన క‌రువు వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది. జ‌నాల వ‌ద్ద డ‌బ్బులు ఉండ‌డం మాట అటుంచితే క‌నీసం వారికి తిన‌డానికి తిండి కూడా దొరికే అవ‌కాశం ఉండ‌దు. ఎంతో మంది పేద‌లు, నిరుపేద‌లుగా మారుతార‌ని ఆర్థిక వేత్త‌లు చెబుతున్నారు.

క‌రోనా మ‌న‌కు నేర్పిన పాఠం.. శుభ్ర‌త‌.. అంత‌కు ముందు ఎంద‌రు దీన్ని పాటించారో తెలియ‌దు కానీ.. ఇక‌పై వ్య‌క్తిగ‌త పరిశుభ్ర‌త పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. జ‌నాలు త‌మ‌ను, త‌మ ఇళ్ల‌ను ఈ దెబ్బ‌కు శుభ్రంగా ఉంచుకుంటారు. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌ల‌ను వారు ఇక‌పై పాటిస్తారు. అలాగే ప్ర‌భుత్వాలు కూడా పారిశుద్ధ్యం, ప‌రిశుభ్ర‌త‌, ఆరోగ్యం, వైద్యం త‌దిత‌ర అంశాల‌కు ఇక‌పై అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తాయి. ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు, ఇక‌పై క‌రోనా లాంటి మ‌హ‌మ్మారి వ్యాధులు వ‌స్తే.. సిద్ధంగా ఉండేందుకు అవ‌స‌రం అయిన వైద్య స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వాలు సిద్ధం చేసుకుంటాయి. ఇది జ‌నాల‌కు శుభ‌వార్తే అని చెప్ప‌వ‌చ్చు.

క‌రోనా వైర‌స్ పూర్తిగా మాయ‌మ‌య్యాక‌.. జ‌నాలకు కొన్ని రోజుల వ‌ర‌కు బ‌య‌ట తిర‌గాల‌న్నా ఇంకా భ‌య‌మే ఉంటుంది. కానీ నెమ్మ‌దిగా ఆ భ‌యం మాయ‌మ‌వుతుంది. ఒక్కొక్క‌రే నెమ్మ‌దిగా అంద‌రూ మ‌ళ్లీ య‌థావిధిగా బ‌య‌ట తిర‌గ‌డం ప్రారంభిస్తారు. త‌రువాత ఎప్ప‌టిలాగే ప‌రిస్థితులు మారుతాయి. నిత్యం లేవ‌గానే.. అదే ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం.. ట్రాఫిక్ ర‌ద్దీ.. నెల వ‌చ్చేసరికి సిద్ధంగా ఉండే అద్దె.. ఇత‌ర బిల్లులు.. ఈఎంఐలు.. వెర‌సి క‌రోనా అనంత‌రం జీవితం కూడా తిరిగి య‌థాత‌థ స్థితికి చేరుకుంటుంది. కానీ అందుకు కొద్ది రోజులు స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు.

క‌రోనా దెబ్బ‌కు ఎంతో మంది ఉద్యోగాల‌ను, ఉపాధిని కోల్పోతే.. వాటికి ఢోకా లేని వారు.. డ‌బ్బును పొదుపు చేసుకునేందుకు చూస్తారు. కొనుగోళ్లు తగ్గిస్తారు. దీంతో దాదాపుగా అన్ని రంగాలూ మ‌ళ్లీ న‌ష్టాల్లోనే కొన‌సాగే అవ‌కాశం ఉంటుంది. వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గుతాయి. కానీ తినే ఆహారాల ధ‌ర‌లు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌రోనా వ‌ల్ల ప్ర‌స్తుతం నిల్వ ఉన్న ఆహారాలు, నిత్యావ‌స‌రాల‌ను మ‌నం ఇప్పుడు ఖ‌ర్చు చేస్తున్నాం కానీ.. ముందు ముందు వాటి ఉత్ప‌త్తి తగ్గేందుకు అవ‌కాశం ఉంటుంది క‌నుక‌.. వాటి డిమాండ్ పెరిగి.. వాటి ధ‌ర‌లు కూడా పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కొద్ది రోజుల‌కు మ‌ళ్లీ వాటి ధ‌ర‌లు తిరిగి య‌థాత‌థ స్థితికి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

క‌రోనా న‌య‌మైనా.. జ‌నాలు ఇక‌పై గుంపులు గుంపులుగా వెళ్లేందుకు జంకుతారు. కానీ కొంత కాలానికి ఆ భ‌యం పోయి మళ్లీ ఎప్ప‌టిలాగే వెళ్తారు. అది ఎక్క‌డైనా స‌రే.. అప్ప‌టికి సామాజిక దూరం అనే ప‌దాన్ని జ‌నాలు పూర్తిగా మ‌రిచిపోతారు.

గ‌మ‌నిక: క‌రోనా మ‌న దేశం నుంచి పూర్తిగా వెళ్లిపోతే.. అనంత‌రం ప‌రిస్థితులు ఎలా ఉంటాయి.. అనే అంశంపై.. పైన ఇచ్చింది కేవ‌లం వ్య‌క్తిగ‌త విశ్లేష‌ణ మాత్ర‌మే.. జ‌నాల అభిప్రాయం కాదు.. క‌రోనా త‌గ్గాక ప‌రిస్థితులు పైన చెప్పిన దానికి భిన్నంగా కూడా ఉండ‌వ‌చ్చు..

Read more RELATED
Recommended to you

Latest news