ఏపీలో రాజధానిపై రచ్చ జరుగుతూనే ఉంది..ఇప్పటికే అమరావతి రైతులు…అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టేశారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే వారి పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి వచ్చింది. వీరికి టీడీపీ-జనసేన-బీజేపీ-కమ్యూనిస్టు పార్టీలు మద్ధతు తెలుపుతున్నాయి.
కానీ వైసీపీ ఏమో మూడు రాజధానులపై ఉంది. కోర్టులో బిల్లు కొట్టేసిన సరే..మూడు రాజధానుల అమలు చేసి తీరుతామని వైసీపీ నేతలు అంటున్నారు. అలాగే అమరావతి రైతుల పాదయాత్రని విశాఖలో అడ్డుకుని తీరుతామని అంటున్నారు. నిజానికి అమరావతి రైతులు వారి దారిలో ముందుకెళుతున్నారు. ఎక్కడా కూడా విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం లేదు. అమరావతిని రాజధాని చేయాలని కోరుతున్నారు.
అయితే వైసీపీ నేతలు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు. అమరావతి వాళ్ళు విశాఖకు వచ్చి..అమరావతిని రాజధాని ఉంచాలని ఎలా కోరుతారని మాట్లాడుతున్నారు. అందుకే వారిని అడ్డుకుంటామని, పాదయాత్రపై రేపు ఏదైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత అని మంత్రి అమర్నాథ్ మాట్లాడుతున్నారు. అంటే అమరావతి రైతుల పాదయాత్ర విశాఖకు వస్తే ఏదో రచ్చ జరగడం ఖాయమని ముందే హింట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ డిమాండ్‌తో వైసీపీ నేతలు..ఉత్తరాంధ్రలోని మేధావులు, విద్యార్ధులు, ఇతర సంఘాలతో జేఏసి ఏర్పాటు చేసి..వారు కూడా ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నారు.
అయితే ఇక్కడ ఎవరి డిమాండ్ కోసం వారు పోరాటం చేయడం తప్పులేదు. ఎవరు ఎక్కడైనా పోరాటం చేయొచ్చు. కానీ తమ ప్రాంతంలో అమరావతి ఎలా అంటరాని, అలా అంటే అడ్డుకుంటామని వైసీపీ నేతలు మాట్లాడటం కరెక్ట్ గా లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎవరి డిమాండ్ వారు వినిపిస్తారని, ఇక ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో ఎన్నికల్లో తెలుస్తుందని, అలా కాకుండా ముందే అధికారంతో అడ్డుకుంటామనేది సరిగ్గా లేదు. ఇప్పటికే సీనియర్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ..గొడవలు పెట్టేలా ఎవరూ మాట్లాడవద్దని, సొంత నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కానీ అమరావతి రైతులు విశాఖలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏదో గొడవ జరిగేలా ఉందని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.