బరువు తగ్గేందుకు అందరూ నానా తంటాలు పడతారు. కానీ కొందరు అనుకున్నది సాధించగలరు. ఇప్పుడు బరువు తగ్గేందుకు రకరకాల డైట్ పద్ధతులు కూడా వచ్చాయి.. వాటి ద్వారా బరువు తగ్గిన వారూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న డైట్ పేరు ఇంటర్మెట్టెన్ ఫాస్టింగ్ (Intermitten Fasting) . ఈ డైట్ ఉపయోగించే ఎలన్ మస్క్ తొమ్మిది కిలోల బరువు తగ్గాడట. అసలేంటి డైట్.. నిజంగానే దీనిద్వారా బరువు తగ్గుతారా..?
ఏంటి ఈ ఫాస్టింగ్?..
మనుషులు వేలాది సంవత్సరాలుగా ఉపవాస పద్ధతిని పాటిస్తున్నాం. ఉపవాసం బరువు తగ్గడం కోసం కూడా చేస్తున్నారు చాలా మంది. అలాంటి ఉపవాసాల్లో ఒకటి ఇంటర్మిట్టెన్ ఫాస్టింగ్. అంటే అప్పుడప్పుడు ఉపవాసం చేయడం. అంటే నాలుగు రోజులు ఒకసారి, లేదా వారానికి ఒకసారి ఉపవాసం చేయడం..
ఎలా చేయాలి?
వారానికి రెండు సార్లు చేయాలి అనుకునే వారు వారంలో రెండు రోజు ఉపవాసం కూడా కేటాయించుకోవాలి. కాకపోతే వరుసగా రెండు రోజులు చేయకూడదు. నెలలో అయిదు రోజులు ఎంచుకుంటే ప్రతి నాలుగు రోజులకోసారి ఉపవాసం చేయాలట.. ఆ రోజుల్లో పదహారు గంటల పాటూ ఘనాహారం ఏమీ తీసుకోకూడదు. పదహారు గంటలు గడిచాక ఘనాహారం తీసుకోవచ్చు. అది తేలికపాటి ఆహారం. ఇక ఆ పదహారుగంటల్లో నీళ్లు, కాస్త పండ్ల రసాలు వంటివి తీసుకోవచ్చు. ఇలా ఇంటర్మిట్టెన్ ఫాస్టింగ్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు ఖరుగుతుంది.
ఫ్యాట్ ఎలా బర్న్ అవుతుంది..?
మనం ఆహారం తీసుకున్నప్పుడల్లా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. కొంత గ్లైకోజన్‌గా మారి శరీరంలో కొవ్వుగా పేరుకుపోతుంది. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో అప్పుడు గ్లూకోజ్ డెఫిసిట్ ఏర్పడుతుంది. ఇప్పుడు కొవ్వుగా పేరుకుపోయిన గ్లైకోజన్ కరిగి గుండె, ఇతర అవయవాలకు అందిస్తుంది. అంటే ఎక్కువ కాలం ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరంలోని కొవ్వు నిల్వలు కరిగిపోతాయి. ఇది కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందట..
నిజంగా బరువు తగ్గుతారా?
ఇంటర్మిట్టెన్ ఫాస్టింగ్ వల్ల నిజంగానే బరువు తగ్గుతారు. రెండు నుండి మూడు నెలల్లో మూడు నుంచి అయిదు కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉందని చాలా అధ్యయనాలు తేల్చాయి. అంతేకాదు ఇలా చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అవుతుందని తెలిపాయి.
వీళ్లు వద్దు..
ఇంటర్మిట్టెన్ ఫాస్టింగ్‌ను కొంతమంది పాటించకూడదు. పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారు, గర్భిణులు, బాలింతలు, థైరాయిడ్ రోగులు ఈ పద్దతిని పాటించకూడదని వైద్యులు అంటున్నారు.