ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ అని తేలిన విషయం విదితమే. దీంతో ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. అయితే ఆయన అభిమానులు ఆయనను త్వరగా కోలుకుని తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అయితే అసలింతకీ స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ అంటే ఏమిటి ? దాని లక్షణాలు ఎలా ఉంటాయి ? అంటే…
లంగ్ క్యాన్సర్ అంటే.. ఊపిరితిత్తులకు క్యాన్సర్ రావడం అని అందరికీ తెలిసిందే. అయితే స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ అంటే.. క్యాన్సర్ బాగా ముదిరిందని అర్థం. అది కేవలం ఊపిరితిత్తులకే కాక ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందుతుందని అర్థం. అయితే ఇది కాకుండా స్టేజ్ 4 క్యాన్సర్ కూడా ఉంటుంది. అంటే.. క్యాన్సర్ మరీ ఎక్కువై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారని అర్థం. అంటే సంజయ్ దత్ కొంత కాలం అలాగే ఉండి ఉంటే ఆయనకు క్యాన్సర్ తీవ్రత ఇంకా ఎక్కువయ్యేదన్నమాట.
అయితే లంగ్ క్యాన్సర్ ఉండే దాదాపుగా 80 నుంచి 85 శాతం మందిలో క్యాన్సర్ కణాలు పెద్దగా ఉంటాయి. కేవలం 10 నుంచి 15 శాతం మందిలో మాత్రమే లంగ్ క్యాన్సర్ కణాలు చిన్నవిగా ఉంటాయి. ఇక లంగ్ క్యాన్సర్‌ను 3ఎ, 3బి, 3సి అని మూడు విభాగాలుగా విభజించారు.
3ఎ లంగ్ క్యాన్సర్‌లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ట్యూమర్లు ఊపిరితిత్తుల్లో ఉంటాయి. కానీ క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించదు.
3బి లంగ్ క్యాన్సర్‌లో ఒకే ఊపిరితిత్తిలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ట్యూమర్లు ఉంటాయి. అవి అడ్వాన్స్ స్టేజిలో ఉంటాయి. క్యాన్సర్ లింఫ్ నోడ్స్‌కు వ్యాపించే అవకాశం ఉంటుంది.
3సి లంగ్ క్యాన్సర్‌లో ఒక ఊపిరితిత్తిలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ట్యూమర్లు ఉంటాయి. లింఫ్ నోడ్స్‌కు కూడా క్యాన్సర్ వ్యాపిస్తుంది. అలాగే ఛాతిలో ఇతర భాగాలకు క్యాన్సర్ విస్తరిస్తుంది. ఇది స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్‌లో అడ్వాన్స్‌డ్ స్టేజ్. ఇక స్టేజ్ 4 క్యాన్సర్ అయితే శరీరంలోని ఇతర అవయవాలకు కూడా క్యాన్సర్ వ్యాప్తి చెందుతుంది.
స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ ఉన్న వారిలో కనిపించే లక్షణాలు ఇవే…
* ఛాతిలో ఎప్పుడూ నొప్పిగా ఉంటుంది.
* విపరీతమైన దగ్గు వస్తుంటుంది. అది ఎప్పటికీ తగ్గదు.
* దగ్గుతున్నప్పుడు నోట్లో నుంచి రక్తం కూడా పడుతుంది.
* శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. గురక లాంటి ధ్వని వస్తుంటుంది.
* బరువు తగ్గుతారు. గొంతు బొంగురు పోతుంది.
* ఆకలి నశిస్తుంది. ఆహార పదార్థాలు, ద్రవాలు మింగేటప్పుడు నొప్పిగా అనిపిస్తుంది.
* తీవ్రమైన అలసట, నిస్సత్తువ ఉంటాయి.
* ముఖమంతా ఉబ్బిపోయి కనిపిస్తుంది.
స్టేజ్ 3 క్యాన్సర్‌లో ఉన్నప్పుడు పసిగట్టకపోతే ఇంకా ఆలస్యం చేస్తే అది స్టేజ్ 4 క్యాన్సర్‌గా మారుతుంది. దీంతో ఇతర అవయవాలకు క్యాన్సర్ వ్యాపిస్తుంటుంది. ఎముకల్లో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. కొన్ని సార్లు జాండిస్ కూడా రావచ్చు.
స్టేజ్ 3 క్యాన్సర్‌కు సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, లేజర్ థెరపీ, ఎండోస్కోపిక్ స్టెంట్ వంటి చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే స్టేజ్ క్యాన్సర్ నుంచి కోలుకోవడం అంత ఆషామాషీ కాదు. కానీ కోలుకుంటే క్యాన్సర్ నుంచి బయటపడినట్లేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.