టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) ఈ మధ్యే ఢిల్లీకి వెళ్లి కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయన బీజేపీలో చేరికతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం ఏర్పడింది. టీఆర్ఎస్ కు రాష్ర్టంలో తామే సమాధానం చెబుతామని వారు గట్టిగా నమ్ముతున్నారు. అందుకు అనుగుణంగానే ఉప ఎన్నికల్లో వ్యూహ రచన చేస్తున్నారు.
తనకు అధికార టీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదని బయటకు వచ్చిన ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు ఈటల రాజేందర్ చెప్పేవన్నీ అబద్దాలని విరుచుక పడుతున్నారు. అంతే కాదు ఈటల రాజేందర్ అక్రమంగా సంపాధించిన ఆస్తులను కాపాడుకునేందుకే కమలం కండువా కప్పుకున్నారని అంటున్నారు. ప్రచార పర్వంలో ఎవరికి వారు స్పీడు పెంచారు. మధ్యలో కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి రాకతో ఒకే సారి పంజా విసురుతోంది.
ఇక బీజేపీలో కూడా రెండు వర్గాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఒకటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్గం, మరోటి రథసారధి బండి సంజయ్ వర్గంగా పేర్కొంటున్నారు. అలా ఉండడంతో నూతనంగా పార్టీలో చేరిన మాజీ వైద్య మంత్రి ఈటల రాజేందర్ సంజయ్ వర్గంలో చేరిపోయారట. ఈటల బండి సంజయ్ వర్గంలో చేరేందుకు కారణాలు లేకపోలేదని సమాచారం. పెద్దపల్లి మాజీ ఎంపీగా సేవలందించి టీఆర్ఎస్ నుంచి బీజేపీలో కి మారిన వివేక్ వెంకటస్వామి వల్లే ఈటల బీజేపీలో బండి సంజయ్ వర్గంలో చేరినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా వివేక్ కు ఉన్న పలుకుబడి కూడా ఈటల బండి సంజయ్ వర్గం వైపు మొగ్గు చూపేందుకు ఒక కారణంగా నిలిచిందని అంటున్నారు. ఏదేమైనా ఈటల చేరికతో బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం రావడంతో పాటు ఎన్నటికైనా టీఆర్ఎస్ ను గద్దె దించుతామనే ధీమా పెరిగినట్లే కనిపిస్తోంది.