పిడుగు అంటే ఏంటి..? ఎలా పడుతుంది..? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి.?

వర్షాకాలం అంటే..రహదారుల్లో వరద నీరు ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక ఇబ్బందులు పడుతూ వెళ్లే వాహనదారులు..పొలాల్లో పని చేసేవాళ్లు ఎప్పుడు పిడుగుపడుతుందో భయపడుతూ ఉంటారు. ఈ ఏడాది పడిన వర్షాల్లో పిడుగుపాటుకు గురై చనిపోయిన వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో అధికంగానే ఉంది. అసలు పిడుగు అంటే ఏంటి..? ఆ టైంలో ఏం జరుగుతుంది..? మనం ఏం చేయాలి.? ఇలాంటి కొన్ని విషయాలను చూద్దాం..!
పిడుగులు ఎలా పుడతాయి అన్నదే అందరిలో కలుగుతున్న సాధారణ ప్రశ్న. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి. అయితే, పై నుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువు ఉన్న ధనావేశిత(పాజిటివ్) మేఘాలు పైకి వెళ్తాయి. ధనావేశిత మేఘాలు పైకి వెళ్లినప్పుడు.. అధిక బరువుండే ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న మేఘాలు కిందికి వచ్చేస్తాయి. ఎప్పుడూ మనకు కనిపించే దట్టమైన నల్లని మేఘాల్లో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయి. మనకు కనిపించే మేఘాలే కిందికి వచ్చిన ఎలక్ట్రాన్లు కలిగినవి.
రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షితమవుతుంటాయి. అప్పుడు.. ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోతాయి.. ఆ సమయంలో దగ్గరలో మరే ఇతర వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు దూసుకెళ్తాయి… దీంతో మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్‌ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. ఇలా రావడాన్నే పిడుగు పడటం అని అంటారు. అర్థంకాలేదా..? మళ్లీ ఓ సారి మెల్లగా చదవండి.!
క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడినప్పుడు వాటిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడి మెరుపులు వస్తాయి. ఈ చర్య జరుగుతున్నపుడు రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల్లో ఒక్కసారిగా కల్లోలం మొదలవుతుంది. అలా పిడుగులు పడతాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
మనం కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఉరుములు పడుతన్నట్లైతే.. కారులోనే ఉండటం మంచిది.
వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే రైతులు భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి.
చెట్ల కిందకు, టవర్ల కిందకు అస్సలు వెళ్లకూడదు..
భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల మీద కూర్చోవాలి.
నదుల్లో, వాగుల్లోని నీటిలో మనం ఉంటే సాధ్యమైనంత త్వరగా బయటకు రావాలి.
ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను కట్టి పెట్డడం మంచిది. విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే అవకాశం ఉంది.
వర్షం పడుతున్న సమయంలో సెల్‌ఫోన్‌, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అస్సలు వినియోగిచ వద్దు. ఎందుకంటే పిడుగులను ఆకర్షించే గుణం వాటికి ఉంటుంది.
మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవాలి. దాంతో ఆ పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మన మీద తక్కువగా పడే అవకాశం ఉంటుంది