ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లు ఇప్పుడు అసలు శాసన మండలిలో ఆమోదం పొందుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ బిల్లుని ఎలా అయినా సరే అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలగా ఉంది. మండలిలో ఆమోదం కోసం మంగళవారం తీవ్ర ప్రయత్నాలు చేసింది ప్రభుత్వ౦. పెద్ద ఎత్తున మంత్రులు మండలికి హాజరు కావడంతో,
బిల్లు ఆమోదం పొందుతుంది అని భావించారు అందరూ. అయితే అక్కడ ప్రభుత్వానికి షాక్ తగిలింది. మండలిలో చైర్మన్ తీరు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. మండలిలో తెలుగుదేశం పార్టీకి 28 మంది సభ్యుల బలం ఉండటంతో పాటుగా రూల్ 71 పై చర్చ జరగాలని పట్టుబట్టారు. దీనిపై సుదీర్గంగా చర్చ జరగగా చివరిగా ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 23 ఓట్లు పడ్డాయి.
ప్రభుత్వానికి అనుకూలంగా 13 ఓట్లు పడగా ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దీనిని సెలెక్ట్ కమిటికి పంపించాలని భావిస్తుంది. సెలెక్ట్ కమిటి మీద ఓటింగ్ జరిగి అక్కడికి వెళ్తే లోతుగా బిల్లులను పరిశీలిస్తారు. దాదాపు మూడు నెలల పాటు ఇది జరుగుతుంది. అప్పటి వరకు బిల్లుల ఆమోదం గాని అమలుకు గాని అవకాశం ఉండదు.
దీనితో మండలిలో సెలెక్ట్ కమిటి మీద ఓటింగ్ జరిగితే మాత్రం బిల్లు ముందుకి వెళ్ళే అవకాశాలు కనపడటం లేదు. ఇప్పటికే మూడు రాజధానుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా ముందుకి వెళ్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. జగన్ కూడా తర్జన భర్జన పడుతున్నారు. విపక్ష వ్యూహాలను ఏ స్థాయిలో తిప్పి కొట్టాలి అని భావించినా సరే బలం లేకపోవడంతో అది సాధ్యం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే 7 నుంచి 9 సవరణలు టీడీపీ బిల్లుల్లో సూచిస్తుంది.