కీలక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇంచార్జ్ హ్యాండిచ్చారా ?

-

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ వ్యవహార శైలి పార్టీ నాయకులకు అంతు చిక్కడం లేదట. ఎప్పుడు వస్తారో.. ఏం చేస్తారో.. ఏం చేయాలి అనుకుంటున్నారో కూడా అంతుబట్టడం లేదని ఫీలవుతున్నారు నాయకులు. ఇంఛార్జ్‌గా దూకుడుగా వచ్చినా.. ఇప్పుడు పార్టీని నత్తనడకన కూడా నడిపించడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు. రాహుల్ కి దగ్గర తెలంగాణను దున్నేస్తాడని భావిస్తే.. ఎన్నికల సమయంలో పత్తా లేకుండా పోయారని గాంధీభవన్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. పీసీసీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియ ప్రారంభానికి ముందు హడావుడి చేసిన ఠాగూర్.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో.. ఎప్పుడు వస్తారో తెలియడం లేదని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్‌గాంధీకి సన్నిహితుడు అన్న పేరే కానీ.. అంత దూకుడు లేదన్నది మరికొందరి వాదన. ఇంతకముందు ఉన్న రామచంద్ర కుంతియాతో ఠాగూర్‌ను పోల్చుకునే వరకు పరిస్థితి వచ్చిందట. ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినా.. కుంతియా కనీసం వారంలో ఒకరోజైన హైదరాబాద్ వచ్చేవారని చెబుతున్నారు.

బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్‌ ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్నికల వేళ దూకుడుగా వెళ్తున్నారు. కానీ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ ఠాగూర్‌ అలాంటి స్పీడ్‌లో లేరట. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడి పార్టీ ప్రచార బాధ్యతలను ఎంపీ రేవంత్‌రెడ్డి చూసుకుంటున్నారు.

నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాములు నాయక్‌ బరిలో ఉండగా.. అక్కడ ప్రచారాన్ని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు చోట్లా తగిన సూచనలు చేసేందుకు ఠాగూర్‌ అందుబాటులో లేరన్నది పార్టీ నేతలు చెప్పేమాట. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాలకు రాలేదు. మధ్యలో ఖమ్మం వచ్చి వెళ్లారు. ఇంతలో తమిళనాడుకు రాహుల్‌గాంధీకి రావడంతో వరంగల్‌ భేటీని వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్‌ నేతల మధ్య సమన్వయం కొరవడిందన్న సంగతి ఇంఛార్జ్‌కు తెలుసు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లేందుకు కొందరు క్యూ కట్టే పరిస్థితి ఉన్నా.. అసంతృప్త నేతలతో మాట్లాడే పరిస్థితి లేదని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో సీనియర్.. ప్రభుత్వంలో నెంబర్‌ టూగా ఉన్న నాయకుడు సైతం జంప్‌ అవుతారని చర్చ జరుగుతోంది.

ఇప్పటికే పీసీసీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియను అర్ధాంతరంగా ఆపేశారనే భావన కొందరు నాయకుల్లో ఉంది. ఇటు చూస్తే నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు ఏ క్షణమైనా షెడ్యూల్‌ ప్రకటించే వీలు ఉంది. ఇంఛార్జ్‌ ఠాగూర్‌ మాత్రం తమిళనాడు బోర్డర్‌ దాటి తెలంగాణ వచ్చే పరిస్థితి లేదని సమాచారం. ఒకవేళ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని అనుకున్నా.. ఆయనకు అప్పగించిన తెలంగాణను గాలికి వదిలేస్తే ఎలా అని గుసగుసలాడుకుంటున్నారు కాంగ్రెస్‌ నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news