వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగిస్తుందనే ధీమా కావొచ్చేమో… ఆ పార్టీలో అప్పుడే ముఖ్యమంత్రి పదవి లొల్లి మొదలయినట్లుగా కనిపిస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందుగానే నేతలు తమ అభ్యర్థిత్వాన్ని బలోపేతం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ గెలిస్తే పలానా నేత ముఖ్యమంత్రి అవుతారని పార్టీ నేతలు ఏదో మాటవరుసకు పేర్కొంటున్నా.. అది పార్టీలో అంతర్గత పోరుకు నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకం కలిగిస్తున్నాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్రలో భాగంగా జరిగిన సభలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలే చేశారు. బండి సంజయ్ ముఖ్యమంత్రి అయితేరాష్ట్రంలోని యువత సమస్యలన్నీ తీరిపోతాయని అన్నారు. దాంతో పార్టీలో మరోసారి అలజడి మొదలైంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అనే చర్చకు దారితీసింది. అయితే.. జితేంతర్‌రెడ్డి వంటి నేత ఆషామాషీగా ఈ వ్యాఖ్యలు చేయరని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి బీజేపీలో ఒక సంప్రదాయం ఉంది. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ ముందుగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించారు. ఫలితాల తర్వాత పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నది అందరికీ తెలిసిందే. ఈ విషయం తెలిసి కూడా జితేందర్‌రెడ్డి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు? తేనెతుట్టెను ఎందుకు కదిపారన్నది చర్చనీయాంశమైంది.
తనకు మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ దాదాపు ఖరారు అయినప్పటికీ.. తన కొడుకుకు షాద్‌నగర్ టికెట్ ఇప్పించుకునేందుకే బండి సంజయ్‌ను పొగడ్తలతో ముంచెత్తడంలో భాగంగా జితేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని ఒక వాదన. అయితే.. ఈ వ్యాఖ్యలనువ్యక్తిగతంగా చూడకూడదని మరికొందరు ప్రతివాదన చేస్తున్నారు. పాదయాత్ర ప్రారంభం నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ‘‘కాబోయే ముఖ్యమంత్రినని.. తనకే పదవి వస్తుందని చెప్పుకునేటోళ్లకు.. ఆ నేత వెంట తిరిగేటోళ్లకు చివరకు టికెట్లు కూడా దక్కకపోవచ్చు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈటల రాజేందర్‌ను దృష్టిలో పెట్టుకునే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారని వార్తలు కూడా వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ పాదయాత్ర ప్రారంభోత్సవ సభలో ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్, విజయశాంతికి తగిన ప్రాధాన్యం లభించలేదు. సభలో మాట్లాడేందుకు వీరికి చివర్లో అవకాశం ఇచ్చారు. ఇది బీజేపీలో ఇంటిపోరుకు నిదర్శమని పేర్కొంటున్నారు.
ఇకపోతే..దాదాపు రెండేళ్ల క్రితం అప్పట్లో కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటనలోనూ ఇలాంటి వ్యాఖ్యానమే వినిపించింది. ఓ సభలో ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి అని ప్రకటించారు. ఇది కూడా సంచలనం కలిగించింది. కానీ.. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో పార్టీలో బండి సంజయ్ ప్రాధాన్యం పెరిగిపోయింది. అదే సమయంలో ఈటల కూడా రేసులోకి వచ్చారని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అనేవారి వాదన కూడా పెరిగిపోయింది. ఈటల వర్గం కూడా బలంగా తయారవుతోందని అంటున్నారు.
ఇకపోతే.. కరీనంగర్ జిల్లాకే చెందిన బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కూడా సీఎం రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయనకు జాతీయ స్థాయిలో కీలక నేతల అండదండలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే బీజేపీలో సీఎం పీఠం కొరకు ఇప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభమైనట్లుగా సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు.