హైకోర్టు తీర్పు కారణంగా సోమేశ్ కుమార్ రిలీవ్ నేపథ్యంలో తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరనేది ఉత్కంఠగా మారింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది. రాష్ట్ర కేడర్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిహోదాలో వసుధామిశ్రా, రాణికుమిదిని, శాంతికుమారి, శశాంక్ గోయల్, సునీల్‌శర్మ, రజత్‌కుమార్, రామకృష్ణారావు, అశోక్‌కుమార్, అర్వింద్ కుమార్ ఉన్నారు.
వారిలో వసుధామిశ్రా, శశాంక్ గోయల్, అశోక్‌కుమార్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. రాణికుమిది కార్మికశాఖ.. శాంతికుమారి అటవీశాఖ బాధ్యతల్లో ఉన్నారు. సునీల్‌శర్మ ఇంధనశాఖ, రజత్‌కుమార్ నీటిపారుదలశాఖ బాధ్యతలు చూస్తున్నారు. రామకృష్ణారావు ఆర్థికశాఖ, అర్వింద్‌కుమార్ పురపాలకశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో రామకృష్ణారావు తదుపరి సీఎస్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌కుమార్, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారిల పేర్లు సైతం పరిశీలన జాబితాలో ఉన్నాయి. పరిపాలన వ్యవహారాల్లో అనుభవం సానుకూలతలను పరిశీలించాకే సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.