బీజేపీలోకి వెళ్లాలని భావించిన తెరాస ఎమ్మెల్యేలను ఒక ముఖ్య నేత ఆపారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. తెలంగాణలో బీజేపీ బలపడాలని భావిస్తున్న సంగతి కొంత కాలంగా స్పష్టంగా అర్ధమవుతుంది. నలుగురు ఎంపీలను తెలంగాణ బీజేపీ గెలిచిన తర్వాత ఆ రాష్ట్ర పార్టీ నేతలు కూడా తెరాస ప్రభుత్వంపై దూకుడు పెంచారు. కెసిఆర్ కు వ్యతిరేక పోరాటాలు జరుగుతుంటే వాటికి ఎక్కువగా మద్దతు ఇస్తూ వస్తున్నారు బీజేపీ నేతలు. పెద్ద ఎత్తున జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు కూడా బీజేపీ నేతలు మద్దతు ఇచ్చారు.
ఈ క్రమంలోనే బీజేపీ లోకి తెరాస నేతలను చేర్చుకునే ప్రయత్నాలను పెద్ద ఎత్తున బీజేపీ మొదలుపెట్టింది. కెసిఆర్ ఆదరణకు నోచుకోని వాళ్లకు కమల దళం రెడ్ కార్పెట్ పరిచి తాము అవకాశాలు ఇస్తామని, పదవులు కల్పిస్తామని హామీలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెరాస నుంచి కొందరు మాజీలు బీజేపీ లో చేరే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడే బీజేపీకి షాక్ తగిలింది అంటున్నారు కొందరు… బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు ఒకరు తెరాస ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేసి వారికి పదవుల హామీ కూడా ఇచ్చే విధంగా ప్రయత్నించారు.
ఇది గమనించిన తెరాస అగ్రనేత ఒకరు వారికి అండగా నిలిచారని సమాచారం. కేంద్రం తమ మీద కేసులు పెట్టిందని, ఐటి దాడులు చేయించే అవకాశం ఉందని, తమ వ్యాపారాల మీద దృష్టి పెట్టిందని వారు ఆ నేత వద్ద వాపోయారు. వెంటనే కెసిఆర్ తో మాట్లాడి ఏ విధంగా ఇబ్బందులు రాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారట. బీజేపీ కి తెలంగాణాలో భవిష్యత్తు ఉండదని, అసలు దక్షిణాదిలో ఆ పార్టీ రాణించడం చాలా కష్టమని, కర్ణాటక మీద మహారాష్ట్ర ప్రభావం ఉంటుంది కాబట్టి విజయం సాధిస్తుంది గాని తెలంగాణాలో అసలు అంత సీన్ ఉండదని ఆ నేత వారికి సూచించారట. ఆ నేతకు ఇటీవల కెసిఆర్ ఒక కీలక పదవి కూడా ఖరారు చేశారు.