శాంతియుతంగా నిరసన చేపడతామన్న రైతులు… నేరుగా ఎర్ర కోట వైపు దూసుకొచ్చారు. పథకం ప్రకారమే వేల మంది రైతులు ఎర్రకోట వైపు దూసుకొచ్చారా..లేక అన్నదాతల ఆక్రోశం కట్టలు తెంచుకుందా..? దేశ గణతంత్రానికి ప్రతీక లాంటి లాల్‌ఖిల్లాపై ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
నిజానికి రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేస్తే హింసాత్మక ఘటనలు జరుగుతాయని.. దీని వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందంటూ ఢిల్లీ పోలీసులు ముందే చెప్పారు. కానీ అన్నదాతల మీద గౌరవంతో అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. తమ నిబంధనలను ఓకే అంటేనే పర్మిషన్ అని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు సహనంతో సాగిన రైతుల ఆందోళన.. ఇలా టర్న్ తీసుకుంటుందని పోలీసులు కూడా గ్రహించలేకపోయారా.. ఎందుకంటే ఎర్రకోటలో రైతులు పోలీసులను తరుముతున్న దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
రైతులు ఒక్కసారిగా ఎర్రకోట వైపు కదలడంతో వేలాది ట్రాక్టర్లు అక్కడికి చేరుకున్నాయి. అటు కాలినడకన అనేక మంది ఎర్రకోట మీదికి చేరుకున్నారు. అయితే కోట దగ్గరికి రైతులు చేరుకున్న తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. ఖిల్లా ప్రాకారాలు ఎక్కి రైతు జెండాలు, సిక్కు జెండాలను ప్రదర్శించారు. ఇక్కడ కొందరు కోటలో ఉన్న రెండో పోల్‌పైకి ఎక్కి కేసరి జెండాను ఎగురేశారు. అయితే ఇది ఖలిస్తానీ జెండా అంటూ ప్రచారం జరిగినా.. అందులో వాస్తవం లేదని తేలింది. మరోవైపు జెండా ఎగురేసింది.. పంజాబ్ కమెడియన్ దీప్ సిద్దూతో పాటు మరికొందరుగా గుర్తించారు.
ఎర్రకోటపై సిక్కు జెండా ఎగరడంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఒక్కసారిగా దూసుకొచ్చిన రైతులను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. అసలు అక్కడికి అంత మంది వస్తారని కూడా ముందుగా ఊహించలేదు. ట్రాక్టర్లతో పోలీసులను వెంటపడి తరమడం కలకలం రేపింది. ఎర్రకోటలో రైతులు తిరగబడటంతో.. కొందరు పోలీసులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. బారికేడ్లు దూకి పరుగులు తీశారు.
అసలు ఎర్రకోటను రైతులు ఎందుకు టార్గెట్‌గా చేసుకున్నారు..నిజానికి ట్రాక్టర్ ర్యాలీకి ముందుగానే లాల్‌ఖిల్లా మీదికి చేరుకునేందుకు కొందరు రైతులు ప్లాన్ వేసుకున్నట్లుగా తెలుస్తోంది. లాల్‌ఖిల్లాకు చేరుకునేందుకే ర్యాలీ రూట్‌ను మళ్లించినట్లు చెబుతున్నారు. అయితే రైతుల నిర్ణయం వెనుక ప్రభుత్వం అలసత్వం కనిపిస్తోంది. చర్చల పేరుతో ప్రభుత్వం తాత్సారం చేయడం.. ఎలాంటి నిర్ణయానికి రాకపోవడంతోనే వారి ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వానికి తామేమీ చేయగలమో చేసి చూపించామంటూ కొందరు రైతులు చెప్పడం ఇక్కడ అసలు విషయాన్ని బయటపెడుతోంది.
రైతుల వాదన అలా ఉంటే.. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. రైతుల తీరుపై భగ్గుమంటున్నారు. ఎర్రకోట ఔన్నత్యానికి భంగం కలిగిందన్న వాదనలు కూడా పెరుగుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం తర్వాతి స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. రైతులను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారంటూ ప్రధాని మోఢీ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడం.. ఎర్రకోటపై మరో జెండా ఎగరడంతో నెక్ట్స్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.