మనకు బాడీలో ఎక్కువ కనిపించేది హెయిర్.. తలమీద ఎంత పెంచుదామన్నా..సరిగ్గా పెరగదు.. కానీ చేతులపై, కాళ్లపై ట్రిమింగ్ చేసే కొద్ది వచ్చేస్తుంది అదేంటో.. అవును మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా..అరిచేతులు, అరికాళ్లపై జుట్టు ఎందుకు ఉండదు అని..! అవును కదా.. మరీ అక్కడ ఎందుకు హెయిర్ రావడం లేదు. ధృవపు ఎలుగుబంటి లేదా కుందేలు వంటి అనేక జీవులు అరచేతిపై లేదా పాదాల దిగువ భాగంలో వెంట్రుకలు కలిగి ఉంటాయి. ఒక్క మనిషికి మాత్రమే ఉండవు.
ఆ ప్రోటీన్ వల్లే పెరగదట..
అరచేతిలో, అరికాళ్లపై వెంట్రుకలు ఎందుకు ఉండవు అనేది శాస్త్రవేత్తలకు చాలా కాలంగా రహస్యంగా ఉంది. అయితే ఇది ఎలా జరుగుతుంది అనే ప్రశ్నకు 2018లో ఓ పరిశోధన సమాధానం చెప్పింది.మన శరీరంలో Wnt అని పిలువబడే ఒక ప్రత్యేక రకం ప్రోటీన్(Protin) ఉంటుందట. ఇది వెంట్రుకల పెరుగుదల, ఖాళీ- కణాల మధ్య పెరుగుదల గురించి సమాచారాన్ని అందించే మాలిక్యులర్ మెసెంజర్‌గా వర్క్ చేస్తుంది. ఈ ప్రొటీన్ ద్వారా వచ్చే సంకేతాలు జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యమైనవట. శరీరంలోని అరికాళ్లు, అరచేతులు వంటి వెంట్రుకలు పెరగని శరీర భాగాల్లో సహజంగానే ఇన్హిబిటర్లు ఉంటాయని, ఈ ప్రొటీన్ తన పనిని చేయకుండా అడ్డుకుంటుందని యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా డెర్మటాలజిస్ట్ సారా మిల్లర్ తెలిపారు. ఈ నిరోధకాలు డిక్కోఫ్ 2(DKK2) అని పిలువబడే ఒక రకమైన ప్రోటీన్.
ఎలుకలపై పరిశోధన..
ఎలుకలపై ఈ ప్రొటీన్ గురించి పరిశోధన చేసినప్పుడు షాకింగ్ ఫలితాలు వచ్చాయట. ఎలుకల నుండి DKK2 ప్రోటీన్ తొలగించబడినప్పుడు, జుట్టు రాని అరచేతిలో కూడా జుట్టు పెరగడం స్టాట్ అయింది.. దీని తర్వాత కుందేళ్ళపై పరిశోధన చేసినప్పుడు, వాటిలో ఈ ప్రోటీన్ చాలా తక్కువగా ఉందని కనుక్కున్నారు.. దాని కారణంగా వాటి చేతులు, కాళ్ళపై ఎక్కువ వెంట్రుకలు పెరుగుతాయని తెలిపారు. మొత్తానికి ఆ ప్రోటీన్ వల్ల అరచేతులు, అరికాళ్లలో జుట్టు రావడం లేదు. మనకు కూడా ఎలుగుబంటికి వచ్చినట్లు అరచేతులపై జుట్టు వస్తే.. లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో కదా..!