తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల్లో ఎందుకీ మార్పు ?

-

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకులకు కొదవేం లేదు. అనేక ఎన్నికల్లో డక్కామొక్కీలు తిన్నవారు ఎందరో ఉన్నారు. ఆ నాయకులంతా ఇటీవల కాలంలో కాంగ్రెస్‌ కోసం ఒళ్లు వంచి పనిచేస్తున్నా.. బుర్రపెట్టి ఆలోచించడం మానేశారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జోరందుకుంది. పార్టీలోని జూనియర్ నాయకులే కాదు.. సీనియర్లు సైతం పార్టీ పెద్దలు ఏం చెబితే అదే చేద్దాం అనే ధోరణికి వచ్చేశారట.


తెలంగాణ కాంగ్రెస్‌లో గతంలో ఇలా ఉండేది కాదు. సీనియర్లు, జూనియర్లు అని నేతల మధ్య స్పష్టంగా ఒక లక్ష్మణ రేఖ ఉండేది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌నే ఒక ఆట ఆడుకునేవారు. మాణిక్యం ఠాగూర్‌ ఏఐసీసీ ఇంఛార్జ్‌గా వచ్చిన తర్వాత ఎవరూ కిక్కురు మనడం లేదు. ఆయన మంత్రమే వేశారో.. లేక వార్నింగ్‌లే ఇస్తున్నారో కానీ.. ఠాగూర్‌ ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టుగా మారిపోయింది. దుబ్బాక ఉపఎన్నికలో ఠాగూర్‌ వ్యూహం తర్వాత అందరికీ ఒక విషయం అర్థమైపోయిందట. అక్కడ ఎదురైన అనుభవాలతో మనకెందుకులే అన్న నిర్లక్ష్యం నాయకుల్లో పెరిగిపోయిందని చెవులు కొరుక్కుంటున్నారు.

దుబ్బాక ఉపఎన్నిక సమయంలో ఆ జిల్లా నాయకులకు ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందని కాంగ్రెస్‌ సీనియర్లు ఠాగూర్‌కు చెప్పారట. ఆ సంగతి మీకెందుకు.. మీకు అప్పగించిన పని చేయండి. గ్రామాలకు ఇంఛార్జులుగా ఉన్నవారు ఎక్కువ ఓట్లు తీసుకురండి అని ముఖం మీదే చెప్పేశారట ఠాగూర్‌. పైగా సొంత డబ్బులు ఖర్చు చేయాలని స్పష్టం చేయడంతో ఒక్కో నేతకు భారీగానే చేతి చమురు వదిలిపోయింది. తీరా దుబ్బాక ఫలితం చూస్తే కాంగ్రెస్‌కు మూడో ప్లేస్‌ వచ్చింది. డిపాజిట్‌ కూడా దక్కలేదు. పైగా బీజేపీ గెలిచి తమకు పక్కలో బల్లెంలా మారిందని నాయకులు చెవులు కొరుక్కుంటున్నారట.

దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులంతా ఉన్న సమయంలోనే హైదరాబాద్‌లో భారీ వర్షాలకు వరదలు వచ్చాయి. దుబ్బాక బదులు ఆ టైమ్‌లో గ్రేటర్‌లో ఎఫర్ట్‌ పెట్టి ఉంటే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంతలో కొంతైనా కలిసి వచ్చేదని నాయకులు లెక్కలు వేసుకుంటున్నారట.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరే ఖర్చు పెట్టుకోవాలి.. గెలుచుకుని రావాలి అని అభ్యర్థులకు తేల్చి చెబుతున్నారట కాంగ్రెస్‌ నాయకులు. పార్టీ కేవలం కండువాలు.. బీఫారాలు ఇస్తుందని ముఖం మీదే తేల్చేస్తున్నారట. గ్రేటర్‌లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి.. ఏమేం చేయాలి అన్న విషయాల్లో సీనియర్లు ఒక్క సలహా కూడా ఇవ్వడం లేదని సమాచారం. అంతా మాణిక్యం ఠాగూర్‌ చూసుకుంటారు. డబ్బులు కాకుండా ఆయనేం చెబితే అదే ఎన్నికల్లో చేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చేశారట.

Read more RELATED
Recommended to you

Latest news