ఏపీ పంచాయితీ ఢిల్లీకి చేరనుంది. గత వారం రోజుల నుంచి ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో చెప్పాల్సిన పని లేదు. టీడీపీ నేత పట్టాభి…సీఎం జగన్‌ని తిట్టడం…దానికి బదులుగా వైసీపీ శ్రేణులు టీడీపీ ఆఫీసులపై దాడులు చేయడం…దానికి నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేయడం…అటు జగన్‌ని తిట్టినందుకు వైసీపీ ప్రజాగ్రహ దీక్షలు చేశారు. ఇలా రెండు పార్టీల మధ్య రచ్చ నడుస్తూనే ఉంది.
అయితే ఏపీలో వైసీపీ అరాచక పాలన సాగిస్తుందని, పార్టీ ఆఫీసులపై దాడితో శాంతిభద్రతలు లేవని తేలిపోయిందని చెబుతూ…ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కోరనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ బాబుకు దొరికింది…అదే సమయంలో ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం బాబు ట్రై చేస్తున్నారు. వారిని కలిసి రాష్ట్రపతి పాలన, జరిగిన దాడులపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని కోరనున్నారు.
అయితే బాబు ఈ రెండిటి కోసమే ఢిల్లీకి వెళుతున్నారా? లేక బీజేపీకి దగ్గరవ్వడానికి వెళుతున్నారా? అనేది క్లారిటీ లేకుండా ఉంది. రాజకీయంగా చూస్తే మళ్ళీ బీజేపీ పెద్దలకు దగ్గరయ్యి, వారి మద్ధతు కూడబెట్టుకుని ఏపీలో జగన్‌కు చెక్ పెట్టాలనేది చంద్రబాబు ఆలోచన అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చారు….కానీ తర్వాత బీజేపీతో విభేదించి బయటకొచ్చి బాగా హడావిడి చేశారు. బీజేపీ నుంచి బయటకొచ్చాక బాబు పరిస్తితి ఏమైందో చెప్పాల్సిన పని లేదు. 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడారు..ఆ తర్వాత రాజకీయంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదే బీజేపీ సపోర్ట్ ఉండుంటే బాబు పరిస్తితి వేరేగా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. అందుకే మళ్ళీ ఇప్పుడు బీజేపీకి దగ్గరయ్యేందుకు బాబు ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోందని, అందుకే ఢిల్లీ పర్యటన అని అంటున్నారు. మరి చూడాలి బీజేపీ…బాబుని కనికరిస్తుందో లేదో?