దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఢిల్లీ స్థాయిలో మంచి పలుకుబడి, మన్నన.. కోరగానే అప్పాయింట్‌మెంట్ ఇచ్చే నాయకులు .. సమస్యలు వినే పెద్దలు ఉండాలని కోరుకుంటారు. అయితే, కేంద్రంలోని పార్టీ ఉన్న రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యేతర పార్టీ రాష్ట్రంలో చక్రం తిప్పితే.. అప్పుడు కేంద్రంలోని పార్టీ సాయం చేయాలని కానీ.. లేదా సహకరించాలని కానీ.. పెద్దగా చెప్పలేం. అందుకే టీడీపీ అదినేత చంద్రబాబు ఎప్పుడు తాను అధికారంలోకి వచ్చినా.. తాను మద్దతిచ్చే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటారు.
గత 2014లోను, అంతకుముందు కూడా అలానే జరిగింది. అయితే, గతానికి, 2014కు మాత్రం భిన్నమైన వాతావరణం కనిపించిం ది. చివరి సంవత్సరంలో చంద్రబాబు స్నేహాన్ని పాడు చేసుకున్నారు. ఏకంగా సీఎం అడిగినా.. ప్రధాని అప్పాయింట్‌మెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా చేసుకున్నారు. ఈ విషయాన్నిచంద్రబాబు స్వయంగా చాటుకున్నారు. తొమ్మిది సార్లు అప్పాయింట్‌మెంట్ కావాలని కోరినా.. ప్రధాని మోడీ ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఢిల్లీతోపాటు.. ఢిల్లీ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్‌తోను, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ బాబు స్నేహం చేశారు. అయితే, వారితో ఇప్పుడు బంధాలు పెద్దగాలేవు.
అంతేకాదు.. బీజేపీలో గతంలో చంద్రబాబును అభిమానించిన గడ్కరీ వంటి నాయకులు, సురేష్ ప్రభు వంటి వారు కూడా ఇప్పుడు బాబు జోలికి రావడం లేదు. అంటే.. దాదాపుగా బాబు హవా సన్నగిల్లిందనే చెప్పాలి. అదేసమయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్.. ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. ఇతర రాష్ట్రాల విషయాన్ని ఆయన పట్టించుకోవడం లేదు కానీ.. ఢిల్లీలో మాత్రం తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రధాని దగ్గర అప్పాయింట్‌మెంట్ తెచ్చుకుంటున్నారు.
కేంద్ర హోం మంత్రి నుంచి కూడా అంతే ఆదరం పొందుతున్నారు. నిజానికి గతంలో చంద్రబాబు మాదిరిగా జగన్ ఎక్కడా కేంద్రంలో తన పార్టీని భాగస్వామిని చేయలేదు. కానీ, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎక్కడ తగ్గాలో తగ్గుతున్నారు. ఎక్కడ నెగ్గాలో నెగ్గుతున్నారు. దీంతో్ బాబు ప్లేస్‌ను జగన్ రీప్లేస్ చేస్తున్నారనే వ్యాఖ్యలు డిల్లీ వర్గాల్లో వినిపిస్తుండడం గమనార్హం.