మీరు వరి విత్తనాలు అమ్మవద్దు అని ఓ కలెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీరు వరి సాగుచేస్తే జైలుకు వెళ్తారు అని కొందరు అధికారులు వచ్చి రైతులను బెదిరించారు. తీరా చూస్తే ఇప్పుడేమో వరి వేసిన వారంతా హాయిగా పంట అమ్ముకునేందుకు, వారి నుంచి మంచి ధరకే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. కానీ అధికారులకు భయపడి అమాయక రైతులు కొందరు తమ భూమిని అలానే వదిలేశారు. కొందరు ప్రత్యామ్నాయ సాగు చేసినా కూడా ఆశించిన ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ దశలో యాసంగి కారణంగా రైతులకు కన్నీరే మిగిలింది. ధాన్యం కొనుగోలు చేసినా కూడా
సకాలంలో పైసలు చెల్లిస్తేనే కేసీఆర్ సర్కారును తాము నమ్ముతామని లేదంటే మళ్లీ కొత్త సీజన్ కోసం పైసలు వెతుక్కోవడం అంటే తమకు కష్టమేనని రైతులు చెబుతున్నారు. మరి ! ధాన్యం కొనుగోలుకు కేసీఆర్ చెప్పిన విధంగా రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. వాటిని విడుదల చేసేందుకు ఖజానాలో నిధులున్నాయా? ఆ మాట కూడా కేసీఆరే చెప్పాలి.
యాసంగిలో వరి వేయవద్దని వేసినా కేంద్రం మన దగ్గర కొనదని పదే పదే చెప్పారు కేసీఆర్. దీంతో చాలా మంది వరి సాగుకు విముఖత చూపారు. కొందరు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. కానీ కొందరు భూములను అలానే వదిలేశారు. దీంతో చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు. ప్రభుత్వం మాట విని నిండా మునిగిపోయామని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వీరంతా తమకు పరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం ఇది.
సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చెబుతున్న విధంగా యాసంగిలో వరి సాగు వద్దని రైతులకు సమాచారం అందడంతో ఒక్క నిర్మల్ లోనే ముప్పై వేల ఎకరాల వరకూ సాగు తగ్గిపోయింది. గత ఏడాది ఇక్కడ 95వేల ఎకరాల మేరకు సాగు కాగా ఇప్పుడు ఇక్కడ 65 వేల ఎకరాలు మాత్రమే వరి సాగయింది. వాస్తవానికి వరి సాగు చేయకుంటే ప్రత్యామ్నాయ పంటలపై చాలా మంది రైతులకు అవగాహన లేని కారణంగా చాలా నష్ట పోయారు. ఉద్యాన వన అధికారులు, క్షేత్ర స్థాయిలో పనిచేసే వ్యవసాయ అధికారులు రైతులకు ఆశించిన స్థాయిలో సమచారం ఇవ్వనందున వీరంతా ఏం చేయాలో పాలుపోక సీఎం మాటలు పాటించి పొలాలను అలానే వదిలేశారు. దీంతో ఒక్కో రైతు నష్ట పోయిన సొమ్ము 45 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉంటుంది. ఎలా చూసుకున్నా రైతులకు ఈ ఏడాది కన్నీరే మిగిలింది. నీళ్లు అందుబాటులో ఉండి మూడు పంటలకు అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన చేసిన కేసీఆర్ ఇప్పుడేమో వడ్లు కొనుగోలు విషయమై రేగిన వివాదంలో రైతులను ఇరుకున పెట్టారా అన్న సందేహాలు విపక్షాల నుంచి వస్తున్నాయి.
వాస్తవానికి ఈ ఏడాది మార్కెట్ వాల్యూ కూడా చాలా బాగుంది. గ్రేడ్ 1 కు ప్రభుత్వమే 1960 చెల్లిస్తోంది. గ్రేడ్ 2 కు 1940 చెల్లిస్తోంది. ప్రభుత్వం తమను కన్ ఫ్యూజ్ చేయకుండా ఉంటే ఈ పాటికి పంట దిగుబడి ఆశించిన విధంగా వచ్చేదని పైగా ఈ సిజన్లో ప్రకృతి విపత్తులు కూడా లేవని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తక్షణమే తమకు పరిహారం ఇవ్వాలని కేసీఆర్ ను చేతులు జోడించి వేడుకుంటున్నారు.