తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో చలి తగ్గింది. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి చలిపెరిగింది. ఉత్తరం, వాయువ్య దిశల నుంచి వచ్చే గాలుల కారణంగా చలి తీవ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలో ఏజెన్సీ ప్రాంతాలు చలికి గజగజ వణికాయి. తెలంగాణ లోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో చలి ఎక్కువగా ఉండేది.
అయితే తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం చలి తీవ్రత తగ్గింది. దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల నుంచి గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని బజార్ హత్నూర్( ఆదిలాబాద్) లో 12.7 డిగ్రీలు , కెరిమెరి( కుమరంభీ) లో 13.2 డిగ్రీలు, అర్లీ టీ( ఆదిలాబాద్) లో 13.2 డిగ్రీలు, మర్పల్లి( వికారాబాద్ ) 13.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.