ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 04న లేదా 07న బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ఏపీ భావిస్తోంది. ఈ విషయంపై త్వరలో ఓ స్పష్టత రానుంది. ఈ బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో నూతన రాజధాని ఏర్పాటు, కొత్త జిల్లాలపై ప్రత్యేక బిల్లులను ప్రభుత్వం తీసుకురానున్నట్టు సమాచారం.
ముఖ్యంగా వచ్చే ఉగాది నాటి నుంచి కొత్త జిల్లాల పరిపాలనను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో.. రెండు నెలల సమయం ఉండటంతో ఈలోపు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది.
మరొకవైపు బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ హాజరవుతుందా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసారు. ఈ తరుణంలో బడ్జెట్ సమావేశాలకు టీడీపీ సభ్యులు హాజరవుతారా లేదా అనే అనుమానం నెలకొంది. టీడీపీ హాజరు కాకపోతే కొత్త జిల్లాల ఏర్పాటు, పీఆర్‌సీపై ప్రభుత్వ వైఖరీ ఓటీఎస్ పథకం వంటి అమలు విషయాల్లో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశముండదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.