హనీ ట్రాప్ చేసి భారీగా నగదు కాజేసే సంఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. కేవలం సాధారణ పౌరులకే కాదు హనీ ట్రాప్ సమస్య ఇప్పుడు ప్రముఖులకూ తప్పడం లేదు. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే తనను ఓ మహిళ హనీ ట్రాప్ చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు.
“కర్ణాటక ఎమ్మెల్యే తిప్పారెడ్డికి అక్టోబర్ 31న గుర్తుతెలియని నంబర్ నుంచి ఓ వాయిస్ కాల్ వచ్చింది. దానికి స్పందించిన ఆయనకు వెంటనే.. అదే నంబర్ నుంచి వాట్సాప్‌లో వీడియోకాల్ రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని కూడా ఆన్సర్ చేయగా.. వీడియోలో ఉన్న మహిళను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. కాల్లో ఉన్న మహిళ హిందీలో మాట్లాడుతూ.. నగ్నంగా ఉంది. వెంటనే ఎమ్మెల్యే ఆ కాల్‌ను కట్ చేశారు. అయితే.. కాల్ కట్ అయిన తర్వాత ఆ నంబర్ నుంచి ఆయనకు కొన్ని పోర్న్ వీడియోస్ వచ్చాయి.” అని ఎమ్మెల్యే తిప్పారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చిత్రదుర్గం పోలీసులు తెలిపారు.
‘పోర్న్ వీడియోస్ వచ్చిన వెంటనే ఆ నంబర్ బ్లాక్ చేసి నేను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వారు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.’ అని ఎమ్మెల్యే తిప్పారెడ్డి తెలిపారు. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులే ఈ హనీట్రాప్‌కు ప్రయత్నించి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు.