హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాలికపై కొందరు సామూహిక అత్యాచారం చేయడంపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఈ కేసులో విచారణకు సంబంధించి సమాచారం ఇవ్వాలని తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అలాగే నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న చర్యలపై జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖ శర్మ డీజీపీకి లేఖ రాశారు.
బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసే వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని రేఖ శర్మ పేర్కొన్నారు. అలాగే ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించి మంగళవారం జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ప్రకటన విడుదల చేశారు. అలాగే వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్‌లో ఐదు అత్యాచార కేసులు నమోదయ్యాయని, సోమవారం ఒక్కరోజే రెండు కేసులు నమోదయ్యాయని మహిళా కమిషన్ పేర్కొంది. మహిళల భద్రత, నేరాల అదుపుపై తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఏడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది.