అయోధ్యలో రామజన్మభూమిలో 221 మీటర్ల ఎత్తున్న శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. రామ మందిర ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసే వరకు ఆ విగ్రమాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. అయితే శ్రీరాముడికి పరమ భక్తుడు అయిన హనుమంతుడి విగ్రహాన్ని కూడా నిర్మించేందుకు పలువురు ప్రతిపాదనలు తెచ్చారు. హనుమంతుడి జన్మస్థలమైన కిష్కింధలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లా హంపి సమీపంలో ఉన్న కిష్కింధలో హనుమంతుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఓ ప్రైవేటు ట్రస్టు ముందుకు వచ్చింది. ఈ మేరకు వారు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సుమారుగా 215 మీటర్ల ఎత్తున్న హనుమంతుడి విగ్రహాన్ని వారు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సదరు విగ్రహ నిర్మాణ ప్రదేశంలో చుట్టూ కాంప్లెక్స్‌ను నిర్మిస్తారు. విగ్రహం చుట్టూ ప్రహరీ గోడలు ఉంటాయి. ఆ కాంప్లెక్స్‌లోని గోడలపై రామాయణానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించేలా డిజైన్లను ఏర్పాటు చేస్తారు.
ఆ కాంప్లెక్స్‌కు నాలుగు వైపులా గోపురాలను కూడా ఏర్పాటు చేస్తారు. అందుఓ ప్రదక్షిణ పాదాలు, ఉద్యానవనాలు, శిల్ప కళాకృతులు, ఇతర డిజైన్లను ఏర్పాటు చేస్తారు. ఆ కాంప్లెక్స్‌లోని 60వ అంతస్థులో శ్రీరాముడికి ఆలయం నిర్మిస్తారు. అయితే ప్రస్తుతానికి ఇది ప్రతిపాదనే అయినా.. కర్ణాటక ప్రభుత్వం ఇందుకు ఒప్పుకునేందుకు అవకాశం కనిపిస్తోంది. కాగా హనుమాన్ విగ్రహం, విగ్రహ ప్రదేశం ఉన్న కాంప్లెక్స్ కు సంబంధించిన 3డీ నమూనాను కూడా విడుదల చేశారు. దీంతో ఆ నమూనా ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే హనుమాన్ విగ్రహాన్ని గనక నిర్మిస్తే అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహం అవుతుంది.