నిమిషాల్లోనే రూ.1లక్ష వరకు రుణం.. ఎంఐ క్రెడిట్ యాప్‌ను లాంచ్ చేసిన షియోమీ..!

-

పర్సనల్ లోన్ కావాలంటే ఒకప్పుడు డాక్యుమెంట్లు పట్టుకుని బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేకుండానే కేవలం నిమిషాల వ్యవధిలోనే లోన్లు ఇచ్చే అనేక యాప్‌లు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌తోపాటు అటు ఆపిల్ యాప్ స్టోర్‌లోనూ లోన్లు ఇచ్చే అనేక యాప్‌లు రోజూ విడుదలవుతున్నాయి. వాటికి యూజర్ల నుంచి ఆదరణ కూడా బాగానే లభిస్తోంది. అందుకనే షియోమీ కూడా ఎంఐ క్రెడిట్ పేరిట ఓ నూతన లోన్ యాప్‌ను మంగళవారం లాంచ్ చేసింది.

Xiaomi Launched Mi Credit App which gives instant loan up to rs 1 lakh

షియోమీ కేవలం భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసమే ఎంఐ క్రెడిట్ పేరిట ఓ నూతన లోన్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌లో కేవలం నిమిషాల వ్యవధిలోనే రూ.1 లక్ష వరకు రుణం పొందవచ్చు. అందుకుగాను స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లలో ఎంఐ క్రెడిట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తరువాత అందులో ఎంఐ అకౌంట్ లేదా ఫోన్ నంబర్‌తో లాగిన్ అయి, కేవైసీ వివరాలను ఎంటర్ చేసి, డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. అనంతరం లోన్ అప్రూవ్ అయి ఆ మొత్తం బ్యాంకు అకౌంట్‌లోకి వెంటనే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇక ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఎంఐ క్రెడిట్ యాప్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. కేవలం షియోమీ ఫోన్ల వినియోగదారులు మాత్రమే కాకుండా, ఇతర ఏ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ అయినా సరే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని షియోమీ తెలిపింది.

షియోమీ తన ఎంఐ క్రెడిట్ యాప్ ద్వారా లోన్లు ఇచ్చేందుకు గాను ఆదిత్య బిర్లా ఫైనాన్స్, మనీ వ్యూ, ఎర్లీ శాలరీ, క్రెడిట్ విద్య, జెస్ట్ మనీ తదితర ఫైనాన్స్ సంస్థలతో భాగస్వామ్యం అయింది. కాగా ఈ యాప్ ఇప్పటి వరకు 10 రాష్ర్టాల్లో కేవలం పైలట్ ప్రాజెక్టు కింద కొంత మంది ఎంపిక చేసిన ఫోన్ యూజర్లకు మాత్రమే లభించగా, మంగళవారం నుంచి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ ఈ యాప్ అందుబాటులోకి వచ్చిందని షియోమీ తెలిపింది. ఇక ఈ యాప్‌లో లోన్ తీసుకుంటే 1.35 శాతం వరకు వడ్డీ ఉంటుందని, తీసుకున్న రుణాన్ని 91 రోజుల నుంచి 3 ఏళ్ల లోపు చెల్లించవచ్చని షియోమీ తెలిపింది. 18 సంవత్సరాలకు పైబడి వయస్సు ఉన్న వారు లోన్ తీసుకునేందుకు అర్హులని షియోమీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news