వైసీపీలో ముదిరిన గ్రూప్ వార్..ఎంపీ సొంతుళ్లో రిజల్ట్ రివర్స్

-

అధికారపార్టీకి ఆ నియోజకవర్గంలో ముచ్చటగా మూడు గ్రూపులు. ఎంపీ, ఎంపీ సోదరి, ఎమ్మెల్యే ఇలా ముగ్గురు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ పుట్టి ముంచేలా ఉంది. ఈ మూడు గ్రూపుల విభేదాలతో పంచాయతీ ఎన్నికలు ఎంపీకి సొంత గ్రామంలో గట్టి షాక్ ఇచ్చాయి. దీంతో ఎంపీ,ఎమ్మెల్యే వర్గాల ఆదిపత్యపోరు పై ఇంట బయట తీవ్ర చర్చ నడుస్తుంది.

చింతలపుడిలో అధికార పార్టీ‌ మూడు వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు ఏలూరు ఎంపీ కోటగరి శ్రీధర్, మరోవైపు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, ఇంకోవైపు ఎంపీ సొంత అక్క అనిత వర్గం. ఇలా మూడు వర్గాలుగా విడిపోవడంతో కార్యకర్తల్లో కూడా చీలికలు పేలికలు కొనసాగుతున్నాయి. ఈ విభేదాల మథ్య, పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ ని బుజ్జగించటంలో పూర్తి గా విఫలమయ్యారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్యాడర్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించటంతో ఫలితాలు రివర్సయ్యాయి. అధికార పార్టీకి నియోజకవర్గంలో తీవ్ర నష్టం జరిగింది.

చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోట మండలం ఈస్ట్ యడవల్లి ఎంపీ సొంత గ్రామం. అక్కడ స్వతంత్ర అభ్యర్థి గా ఎంపీ శ్రీధర్ సొంత అక్క అనిత పోటీకి దిగగా, ఎంపీ తన దగ్గర బంధువైన గాంధీని పోటీలో నిలిపారు. కాని విజయం మాత్రం ఎంపీ సోదరి అనితని వరించింది. 520 ఓట్ల మెజార్టీతో ఆమె గెలిచారు. 10 వార్డుల్లో 9 అనిత ప్యానెల్ లోని స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకోవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. సాక్షాత్తూ ఎంపీ శ్రీధర్ కుటుంబం నుండి ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో దిగడం, ఎంపీ మద్దతు తెలిపిన అభ్యర్థి ఓడిపోవటం వైసీపీ వర్గాలకు సైతం మింగుడుపడడం లేదు.

గత ఏడాది జరగాల్సిన పరిషత్ ఎన్నికల్లో ఆమె ఎంపీపీ స్థానాన్ని ఆశించారట. అయితే, ఒకే ఇంట్లో ఎంపీ పదవి ఉండగా మళ్ళీ ఇంకో పదవి సబబు కాదనే అభిప్రాయంతో ఆమెకు అవకాశం రాలేదట. దీంతో అక్కా తమ్ముళ్ల మధ్య భేధాభిప్రాయాలు వచ్చినట్టు పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఈ అగాధం చివరికి పార్టీకి నష్టం కలిగిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గంలో చాలా చోట్ల రెబల్స్ పోరు కనిపించింది. త్రిముఖ పోటీతో రసవత్తర రాజకీయాలు నడిచాయి.

ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దతుదారులు, మరోవైపు సిట్టింగ్ ఎంపీ మద్దతుదారులు, మరో వైపు ఎంపీ అక్క మద్దతుదారులు బరిలో దిగడంతో ప్రత్యర్థి అభ్యర్థులకు ప్రయోజనంగా మారింది. వైసీపీ రెబల్స్ ను టీడీపీ, జనసేన పార్టీలు తమ వైపు తిప్పుకుని నియోజకవర్గంలో లాభపడ్డాయి.
ఎంపి, ఎంపీ సోదరి, ఎమ్మెల్యే మధ్యల కోల్డ్ వార్ కాస్తా తారాస్థాయికి చేరిందని‌ ఆ పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది. ఎవరికి వారు పట్టు సాధించాలనుకుంటున్నారు. ఇదిలానే కంటిన్యూ అయితే భవిష్యత్తులో పార్టీ కి తీవ్ర నష్టం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news