తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కు 27,262 ఓట్ల ఆధిక్యం లభించింది. కంచర్ల శ్రీకాంత్ కు 1,12,514 తొలి ప్రాధాన్య ఓట్లు రాగా… వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి 85,252 తొలి ప్రాధాన్య ఓట్లు లభించాయి. మొదటి ప్రాధాన్య ఓట్లతో ఫలితం తేలకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాగా, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపులో వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతోంది. అయితే, ఏడో రౌండ్ కు వచ్చేసరికి వైసీపీ ఆధిక్యం తగ్గింది.
ప్రస్తుతం ఏడు రౌండ్ల లెక్కింపు పూర్తి కాగా, వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కేవలం 1,382 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 7 రౌండ్ల అనంతరం రవీంద్రారెడ్డికి 65,136 ఓట్లు లభించగా, టీడీపీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి 63,754 ఓట్లు లభించాయి. ఇక, ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 8 రౌండ్లలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ఆధిక్యం సంపాదించారు. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి చిరంజీవిరావు ఆధిక్యం 27,315 ఓట్లు. కాగా, అభ్యర్థి విజయానికి 94,509 ఓట్లు కావాల్సి ఉండగా… టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు 82,956 ఓట్లు వచ్చాయి. దాంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ ఫలితాలు రేపు ఉదయం నాటికి వెల్లడవుతాయని సమాచారం.