ఉప ఎన్నిక వేళ‌ ఎమ్మెల్యే ఆనం పై వైసీపీలో ఆసక్తికర చర్చ

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలో ఎమ్మెల్యే ఆనం పై వైసీపీలో ఆసక్తికర చర్చ మొదలైంది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకటగిరి కూడా ఉంది. కిందటి ఎన్నికల్లో ఆయనకు మంచి మెజారిటీ రావడంతోపాటు.. వైసీపీ లోక్‌సభ అభ్యర్థికి కూడా ఓట్లు భారీగానే పడ్డాయి. అలాంటిది కీలకమైన ఉప‌ఎన్నికల‌ సమయంలో సీనియర్ ఎమ్మెల్యే ఆనం సైలెంట్ అవ్వడంతో ఎమ్మెల్యే పై నెల్లూరు వైసీపీలో‌ ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. ప్రస్తుతం మాజీ మంత్రి. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ కష్టాలు ఆనంని వెన్నాడుతున్నాయి. కాంగ్రెస్‌ను వీడి టీడీపీలోకి వెళ్లారు. మొన్నటి ఎన్నికల సమయంలో టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా ఏదో ఉన్నారంటే ఉన్నారు అని అనుకునే పరిస్థితి. ఇంతకుముందులా జిల్లాలోని నాయకులు ఆయనకు గౌరవం ఇవ్వడం లేదట. జిల్లా అంతా ఆనం కుటుంబానికి అనుచరగణం ఉన్నా.. వెంకటగిరి దాటి దాటి బయటకు రావడం లేదు.

గత కొంత కాలం క్రితం నెల్లూరు మాఫియా అని కామెంట్స్‌ చేసి వైసీపీలో కలకలం రేపారు ఆనం. ఆ ఎపిసోడ్‌లో సీఎం జగన్‌తో భేటీ అయిన తర్వాత మౌనం దాల్చారు. కొన్నాళ్ల తర్వాత సోదరుడు ఆనం వివేకానందరెడ్డి జయంతికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నెల్లూరు మున్సిపల్‌ సిబ్బంది తొలగించడంతో భగ్గుమన్నారు ఈ మాజీ మంత్రి. ఆ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్‌పై ఇప్పటికీ జిల్లాలో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆనం కుటుంబం సత్తా చూపిస్తామని సవాల్‌ చేశారు. వివేకా మరణంతో నెల్లూరు నగరానికి దూరం కాలేదని.. సిటీలోని ప్రతికుటుంబంలో తమకు అభిమానులు ఉన్నారని తెలిపారు ఆనం.

ఆనం సొంత పార్టీ నాయకులతో ఇలా అంటీముట్టనట్టు ఉన్న సమయంలోనే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక వచ్చింది. కిందటి ఎన్నికల్లో ఆయనకు మంచి మెజారిటీ రావడంతోపాటు.. వైసీపీ లోక్‌సభ అభ్యర్థికి కూడా ఓట్లు భారీగానే పడ్డాయి. జిల్లా అంతటా అనుచరగణం ఉన్న ఆనం ఉపఎన్నిక సమయంలో అంటిముట్టనట్లు‌ వ్యవహరిస్తున్నారు. ఈ దఫా ఎంపీ అభ్యర్థికి ఇంకా ఎక్కువ మెజారిటీ రావాలని పార్టీ అధినేత, సీఎం జగన్‌ ఎమ్మెల్యేలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కానీ జిల్లా రాజకీయాల్లో ఆనం యాక్టివ్‌గా లేకపోతే పార్టీకి ఎలాంటి నష్టం చేకూరుస్తుందో అన్న చర్చ సాగుతోంది.