పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇటు సినిమాల్లో అయినా.. అటు రాజకీయాల్లో అయినా ఆయనకి ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు. హీరోలకతీతంగా.. రాజకీయాలకు అతీతంగా ఆయనకు అభిమానులుంటారు. పవర్ స్టార్ బర్త్ డే వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన రోజు సంబురాలు అంబరాన్నంటుతుంటాయి. చాలా మంది పెద్దపెద్ద హీరోలు కూడా పవన్ బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంటారు. అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులు కూడా పవర్ స్టార్ పుట్టిన రోజు వేడుకలను చేస్తుంటారు.
నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఒకరిపై ఒకరు నిప్పులు చల్లుకునే అధికార ప్రతిపక్షాలు అప్పుడప్పుడు కలిసి ఒకచోట కనిపిస్తూ ఉంటాయి. పుట్టిన రోజు వేడుకలకు ఒకరినొకరు విష్ చేసుకుంటారు. అయితే ఓ అరుదైన ఘటన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో కనిపించింది. ఏకంగా అధికార పక్షం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ బర్త్ వేడుకల్లో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఇటీవల జనసేన ఆధ్వర్యంలో జరిగిన పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో వైకాపా ఎమ్మెల్యే రోశయ్య పాల్గొన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతమవుతున్నాయి. అన్నదానంలో జనసేన నాయకులతో కలిసి ఎమ్మెల్యే భోజనం వడ్డించడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో పెదకాకాని ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యురాలు గోళ్ల జ్యోతి పాల్గొన్నారు.