ఎంపీ ఎమ్మెల్యే ఆధిపత్యపోరు మున్సిపల్ ఎన్నికల పై పడిందా

-

సార్వత్రిక ఎన్నికలై గెలిచింది మొదలు గోదావరిజిల్లాలోని ఎంపీ,ఎమ్మెల్యే ఆధిపత్యపోరు అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఎడ్డెమంటే..ఈయన తెడ్డెమంటున్నారు. పల్లెపోరులో ఇలాగే పోటీలు పడి ఇద్దరు నేతలు రెబల్స్ ని రంగంలో దింపారు. చివరికి అసలు అభ్యర్ధుల కంటే కొసరు అభ్యర్దులు ఎక్కువ స్థానాల్లో గెలిచారు. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఆ ఎఫెక్ట్ కనిపిస్తోందట.

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో మొదటి నుంచి అధికారపార్టీ‌ అంతర్గత విబేధాలతో కొట్టుమిట్టాడుతోంది. ఏలూరు ఎంపీ కోటగరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాలకు అస్సలు పడటం లేదు. కార్యకర్తలు సైతం రెండు వర్గాలుగా విడిపోయారు. పంచాయతీ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించింది. చాలా పంచాయతీలలో ఎమ్మెల్యే ఒకరికి, ఎంపీ మరొకరికి మద్దతిచ్చారు. ఆవిధంగా పది మంది రెబల్స్‌ గెలిచారు. ఇప్పుడు ఇద్దరి మధ్య పోరుకు మున్సిపల్‌ ఎన్నికలు వేదిక అవుతున్నాయి. మున్సిపాలిటీలో పట్టు సాధించేందుకు రెండు వర్గాలు పావులు కదుపుతున్నారు.

గత ఏడాది మున్సిపల్ నోటిఫికేషన్‌ ఇచ్చిన సమయంలో ఎంపీ శ్రీధర్‌, ఎమ్మెల్యే ఎలీజా ఇద్దరు కలిసి ఒక అభ్యర్థిని ఛైర్మన్‌గా ప్రకటించారు. సదరు అభ్యర్థి ఎంపీ అనుచరుడిగా చెబుతారు. ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యేకు పడటం లేదు. ఆ కారణంగా మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థిని మార్చే యోచనలో ఎమ్మెల్యే ఎలీజా ఉన్నట్టు తెలుస్తోంది. అధికారపార్టీలో దీని పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే నిజమైతే గ్రూపు పాలిటిక్స్‌ తారాస్థాయికి వెళ్లినట్టేనని పార్టీ కేడర్‌ ఆందోళన చెందుతోందట. ఎమ్మెల్యే ప్రతిపాదించిన వ్యక్తిని ఛైర్మన్‌ను చేస్తారా లేక ఎంపీ అనుచరుడికి ఆ పదవి దక్కుతుందా అని వైసీపీ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.

చింతలపూడిపై కోటగిరి ఫ్యామిలీకి పట్టుఉండటంతో ఎంపీ శ్రీధర్‌, ఎమ్మెల్యే ఎలీజా కలిసి పనిచేసినట్టయితే పంచాయతీలఎన్నికల్లో ఫలితాలు మరోలా ఉండేవని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే ఆదిపత్యపోరు నడుస్తుండటంతో స్థానిక నేతలు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట..ఎన్నికలు ముగిసేనాటికి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news