చంద్రబాబు కంచుకోటలో వైసీపీ దూకుడు

-

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు కంచుకోట. గత ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనే గెలుస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ కాస్త తగ్గినా.. ఇక్కడ పసుపు జెండా ఎగరడం మాత్రం ఆగలేదు. ఇప్పుడు ఆ కోటను బద్దలు కొట్టాలనే వ్యూహంతో పనిచేస్తోంది అధికార వైసీపీ. నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీల పై కన్నేసిన అధికారపార్టీ బాబు కంచుకోటను బద్దలుకొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది.

గత ఎన్నికల్లో కుప్పం ఫలితాల మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు నాయుడు కాస్త వెనుకబడ్డారు. ఈ విషయం వైసీపీ నేతల మైండ్లో బాగా ఫిక్స్ అయింది. గట్టిగా ప్రయత్నిస్తే బాబు గారిని దెబ్బ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని..ఇప్పటికీ ఇదే వైసిపి నేతలు బలంగా నమ్ముతున్నారట. సొంతగడ్డపై చంద్రబాబుకు షాక్‌ ఇస్తే..ఆ ప్రభావం ఏపీ రాజకీయాలపై బాగా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

పంచాయతీ నోటిఫికేషన్ రాక ముందు నుంచే కుప్పంలో టీడీపీకి చెక్‌ పెట్టడానికి వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టిడిపితో 30 ఏళ్ల అనుబంధం ఉన్న కుప్పం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్.. ఇటీవలే వైసిపిలో చేరారు. ఇది టిడిపికి పెద్ద కుదుపుగానే చెబుతున్నారు. జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ శ్యామ రాజు సైతం టిడిపిని వీడారు. ఇక కుప్పంకు చెందిన మాజీ జెడ్పి చైర్మన్ సుబ్రమణ్యం రెడ్డి.. త్వరలోనే వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారు.

కుప్పం నియోజకవర్గంలో బీసీల జనాభా ఎక్కువ. వీరిపై వైసిపి దృష్టి సారించింది. కుప్పంలో టీడీపీకి మంచి మెజారిటీ కట్టబెట్టేది గుడిపల్లె మండలం. ఇక్కడ నుంచే వైసీపీలోకి వలసలు మొదలెట్టారు. కుప్పం వ్యవహారాలు చూస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు క్యాడర్ ను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారట.గత కొద్దిరోజుల నుంచి గ్రౌండ్‌వర్క్‌ మొదలెట్టిన వైసీపీ కుప్పంలో ఏకగ్రీవాలపై ఫోకస్‌ చేసింది.

గుడిపల్లె, కుప్పం, శాంతిపురం ,రామకుప్పంలో మండలంలోని 90 పంచాయతీలలో ఎన్నికల ముందే 20 శాతం ఏకగ్రీవాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. అందుకే స్దానిక నేతలకు రకరకాల ఆఫర్స్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఏకగ్రీవం అయితే వచ్చే ఇరవైలక్షలు మీకే ఇస్తాం.. పోటి నుండి తప్పుకోండని, ఉపాది హామీ బిల్లు మంజూరు చేయిస్తామన్న తాయిలాలతో పాటు నయానో భయానో వారిని తమదారికి తెచ్చుకుంటోంది. దీంతో కొన్ని పంచాయతీల్లో.. తమ్ముళ్ళు సైడ్ అయ్యారని టాక్ నడుస్తోంది.

పది వరకు పంచాయతీల్లో ఏకగ్రీవాలు చేస్తామని అంటున్నారు వైసీపీ నేతలు. ఇక ఎన్నికల సమయంలో పోటీలో ఆర్ధికంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతోంది అధికార పార్టీ. వారు ఖర్చుకు వెనకడుగు వేయకుండా ఉండటంతో లోకల్ టిడిపి నేతలు అయోమయంలో పడ్డారని సమాచారం. టీడీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నా.. స్థానిక నేతలు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదని ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

కుప్పం నియోజకవర్గంలోని సగం పంచాయతీల్లో వైసీపీ వర్గం గెలిచినా.. చంద్రబాబు నైతికంగా ఓడినట్లే అని అధికార పార్టీ భావిస్తోంది. మరి, వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయా లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news