హిందూపురం స్థానం అంటే నందమూరి ఫ్యామిలీ అడ్డా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైఎస్సార్ ఫ్యామిలీకి పులివెందుల ఎలాగో..నందమూరి ఫ్యామిలీకి హిందూపురం అలా. ఇక్కడ 1983 నుంచి వరుసగా టిడిపి గెలుస్తూనే వస్తుంది. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ సత్తా చాటుతూనే ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో బాలయ్య మంచి మెజారిటీలతో గెలిచారు. ఈ సారి కూడా గెలుపు దిశగానే వెళుతున్నారు. తాను అందుబాటులో లేకపోయినా సరే..ఎప్పటికప్పుడు హిందూపురంలో సమస్యలు పరిష్కరించేలా పనిచేస్తున్నారు.
అధికారంలో లేకపోయిన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేయిస్తున్నారు. అందుకే హిందూపురంలో బాలయ్య బలం తగ్గలేదు. ఇక ఇక్కడ పైచేయి సాధించాలని వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. అధికార బలంతో స్థానిక సంస్థల్లో గెలిచారు గాని..ఓవరాల్ గా మాత్రం హిందూపురపై పైచేయి సాధించలేదు. పైగా ఇంచార్జ్‌గా ఉన్న ఇక్బాల్ చుట్టూ ఎప్పుడు వివాదాలే. ఆయన్ని సొంత పార్టీ నేతలే వ్యతిరేకించే పరిస్తితి.
ఇదే క్రమంలో ఇటీవల చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈయన జగన్ అభిమాని..గతంలో హిందూపురం వైసీపీ సమన్వయకర్తగా పనిచేశారు. వైసీపీలో ఉండే విభేదాల వల్లే ఆయన హత్య జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక రామకృష్ణారెడ్డి హత్య తర్వాత..ఆయన కుటుంబం హిందూపురంలో యాక్టివ్ అయింది. రామకృష్ణారెడ్డి సోదరి మధుమతి హిందూపురంలో ఎంట్రీ ఇచ్చారు. ఎన్‌ఆర్‌ఐగా ఉన్న ఆమె..ఇకపై హిందూపురంలోనే ఉంటానని, ఇక్కడే ఇల్లు కూడా తీసుకుంటానని, ప్రజల్లో తిరుగుతానని ఇటీవల జగన్‌కు కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీ అధిష్టానం సైతం మధుమతికి ఇంచార్జ్ పదవి ఇవ్వడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మధుమతికి నియోజాకవర్గంలోని పలువురు ఎంపిటిసి, జెడ్‌పిటిసి సభ్యులు మద్ధతుగా నిలుస్తున్నారు. ఈ పరిణామాలని బట్టి చూస్తే ఇక ఇక్బాల్‌ని సైడ్ చేసి..హిందూపురం సీటు మధుమతికి ఇస్తారనే ప్రచారం వస్తుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే హిందూపురంలో బాలయ్యపై మధుమతి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.