వైసీపీ ప్లీనరీలో అధికార పార్టీకి చెందిన ఓ నేత వద్ద గన్ దొరకడం కలకలం సృష్టించింది. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం జడ్పీటీసీ ఆర్‌బీ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ప్లీనరీకి వస్తూ రివాల్వర్‌ను వెంట తీసుకొనివచ్చారు. అయితే ఎంట్రెన్స్ వద్ద తనిఖీల్లో పోలీసులు రివాల్వర్‌ను గుర్తించారు. దీంతో… వెంటనే దానిని, ఆయన్ను మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు. వారు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకుని.. లైసెన్సు, సంబంధిత పత్రాలు చూపి ప్లీనరీ ముగిశాక దానిని తీసుకెళ్లాలని జడ్పీటీసీకి తెలిపారు. ఈ వ్యవహారాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. కానీ ప్లీనరీ ముగిశాక బయటపడింది.
రివాల్వర్‌ను తిరిగి తీసుకునేందుకు జడ్పీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం రాత్రి రూరల్ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రాంగణం వద్దకు రివాల్వర్‌తో ఎలా వచ్చారని అడుగగా.. రివాల్వర్ ఎప్పుడూ తనతోనే ఉంటుందని, కారులో ఉంచి రావడం శ్రేయస్కరం కాదని భావించి సమావేశానికి తీసుకొచ్చానని ఆయన సమాధానమిచ్చారు. అయితే.. వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిన్న ముగిసిన విషయం తెలిసిందే.