ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడమే వైసీపీ లక్ష్యమని అన్నారు జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి వదిలించుకొనే కుట్ర మొదలైందన్నారు. అందులో భాగంగానే ఉపాధ్యాయులపై వేధింపులు మొదలయ్యాయన్నారు. ఇంటి గడప దాటి సచివాలయానికి వెళ్లని సీఎం కూడా హాజరు గురించి చెబుతున్నాడని అన్నారు. పాఠశాల విద్యను పేదలకు దూరం చేసే కుట్రకు వైసీపీ ప్రభుత్వం తెర తీసిందన్నారు నాదెండ్ల. దీనికి సంస్కరణలు, సాంకేతికత వినియోగం లాంటి ముసుగు వేస్తోందన్నారు.
జగన్ పాలనలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఉచిత విద్య, దానిపై చేసే ఖర్చులను తగ్గించాలనే విధానంతో ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు.అందులో భాగంగానే ఉపాధ్యాయులను వేధించే చర్యలకు పాడుతున్నారని అన్నారు.బోధన విధులకు దూరం చేస్తూ అందుకు సంబంధం లేని పనులకు బాధ్యులను చేస్తున్నారని..మరుగు దొడ్ల ఫోటోలు తీయించడం, మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేయడం, కోడి గుడ్ల లెక్కలు రాయడం లాంటివి చేయిస్తూ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు సమయం తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఉపాధ్యాయుల హాజరుకి సంబంధించి ఫేస్ రికగ్నిషన్ యాప్ అని గందరగోళ పరుస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీపీఎస్ రద్దు గురించి టీచర్లు ప్రశ్నిస్తున్నారు కాబట్టి వారిని ప్రభుత్వం వేధిస్తోందన్నారు.అర్ధం లేని యాప్స్, ఫోటోలు తీయడం లాంటి పనులను పక్కనపెట్టాలని డిమాండ్ చేశారు.