రాజకీయాల్లో ఎన్నో వైరాలు ఉంటాయి. ఎన్నో విభేదాలు ఉంటాయి. కానీ ఇవాళ రెండు మంచి పరిణామాలు జరిగాయి.ఆ రెండూ సానుకూల పరిణామాలే కావడం విశేషం. ఒకటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తరఫున జరిగింది..మరొకటి వైఎస్ భక్తుడి తరఫున జరిగింది. ఈ రెండూ విని, చదివి తెలుగుదేశం అభిమానులు ఆనందిస్తున్నారు. అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నా., కొన్ని తప్పిదాలు పెద్దాయన విషయంలో జరిగి ఉన్నా కూడా వాటి సంగతి అటుంచి ఈ రోజు జగన్ తన గొప్ప బాధ్యతను నెరవేర్చారు.
ఆ విధంగా నాయకుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాల తీరు ఎలా ఉన్నా జన్మదిన వేళ తన తరఫున ఎంతో మంచి భావనతో ఆయనకు శుభాకాంక్షలు తెలపడం విశేషం.
యోగి సినిమా నిర్మాత, ఇంకా చెప్పాలంటే వైఎస్ భక్తుడు, కమలాపురం శాసన సభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ఇవాళ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ మాటకు వస్తే వైసీపీ అధినేత జగన్ కూడా తన ట్విటర్ ఖాతాలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి హుందాతనం చాటుకున్నారు. దేవుడి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకున్నారు.
ఎంతో మందికి ఆయన ఇవాళ ఓ స్ఫూర్తి అన్న మాటను తెలుగుదేశం నాయకులు మాత్రమే కాదు ఇతర పార్టీల నేతలు కూడా కొనియాడుతున్నారు. ఓ విధంగా ఆయన ఉంటే అమరావతి నిర్మాణంలో కొంతయినా కొలిక్కి వచ్చేదని, ఏపీకి పెట్టుబడులు వచ్చేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఇక రవీంద్రనాథ్ రెడ్డి విషయానికే వస్తే ఇవాళ ఇంద్రకీలాద్రికి అమ్మవారి దీవెనలు అందుకునేందుకు చంద్రబాబు వెళ్తుండగా, మార్గ మధ్యలో రవీంద్ర నాథ్ రెడ్డి ఎదురయ్యారు. దీంతో రవీంద్ర నాథ్ రెడ్డి నేరుగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఎంతో హుందాతనం చాటుకుని అక్కడున్న తెలుగుదేశం నాయకుల అందరి మనసూ గెలుచుకున్నారు.