ఎప్పటికప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఏం జరుగుతుందనే విషయం ఎవరికీ తెలిసినా తెలియకపోయినా జగన్ కు మాత్రం తెలిసిపోతోంది. నిత్యం, పార్టీ, ప్రభుత్వానికి సంబందించిన అన్ని విషయాలను సమీక్షించుకుంటూ, లోపాలను సరిదిద్దికుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో జగన్ పూర్తిగా నిమగ్నమైనా, పార్టీ వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచారు. క్షేత్రస్థాయిలో ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు అనే విషయం పూర్తిస్థాయిలో జగన్ వద్దకు చేరిపోయేలా ఏర్పాటు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎవరు పనితీరు ఏ విధంగా ఉంది అనే విషయం ఎవరికి తెలిసినా, ఎవరికి తెలియకపోయినా జగన్ వద్ద మాత్రం ఖచ్చితమైన సమాచారం ఉంటుంది.
ఏపీలో 151 సీట్లతో తిరుగులేని అధికారాన్ని దక్కించుకున్న జగన్ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు అనే ఉద్దేశంలో ఉన్నారు. అందుకే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎక్కడా అవినీతి వ్యవహారాలు చోటు చేసుకోకుండా జగన్ చాలా జాగ్రత్త పడుతున్నారు. ఏపీ సీఎంగా తాను ఎంత సమర్ధవంతంగా పని చేసినా, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ప్రభుత్వ ప్రతిష్ట ఆధారపడి ఉంటుందని జగన్ నమ్ముతున్నారు. ఎమ్మెల్యేలు అవినీతి వ్యవహారాల్లో మునిగితేలితే, ఆ అప్రతిష్ట ప్రభుత్వం మూటగట్టుకోవాల్సి ఉంటుందని, ఫలితాలపై తప్పకుండా ఆ ప్రభావం పడుతుందని జగన్ అభిప్రాయపడుతున్నారు.
అందుకే ప్రతిరోజు అధికారులతో సమీక్ష చేస్తూ, కేవలం ప్రభుత్వ పరిపాలన మీదే దృష్టి పెడితే, పార్టీ నాయకులు గాడి తప్పే ప్రమాదం ఉందని గ్రహించిన జగన్ మంత్రులలోనూ చురుకుదనం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలకు వరుసగా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో, ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయం ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారికి సంబంధించిన ఆధారాలను దగ్గర పెట్టుకుని మరి, వారికి వార్నింగులు ఇచ్చేస్తున్నారట. గత కొంతకాలంగా ఎమ్మెల్యేల వ్యవహారాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.
చాలా మంది అవినీతి వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చి వివాదాస్పదం అవుతున్నారు. ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా ప్రభుత్వంపై దాడి చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలు బయట పడుతుండటం జగన్ కు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే చాలామంది ఇటువంటి ఎమ్మెల్యేలను పిలిచి మరి నేరుగా జగన్ వార్నింగ్ లు ఇచ్చారు. వారి అవినీతి వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలను వారికి చూపించి, దీనిమీద ఏం సమాధానం చెబుతారు అంటూ నేరుగా నిలదీస్తుండటంతో వారంతా ఒక్కసారిగా షాక్ తింటున్నారట.
తాను అవినీతిలో వ్యవహారాల్లో తలదూర్చవద్దు అని ఎన్నిసార్లు చెబుతున్నా, మీరు ఎందుకు మారడం లేదు అంటూ నేరుగానే జగన్ నిలదీస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ ఎమ్మెల్యేలపై ఈ స్థాయిలు నిఘా ఏర్పాటు చేసి, అన్ని ఆధారాలను సేకరిస్తున్న తీరుతో ఎమ్మెల్యేలు నిత్యం భయం భయంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందట.
-Surya