టీడీపీ మహిళా నేతల్లో మరొకరు పార్టీ మారేందుకు, బాబుకు ఝలక్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైందా ? చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. చిత్తూరు జిల్లాకు చెందిన డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబం త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైందనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా ఆయనతో డీకే కుమారుడు శ్రీనివాస్ భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి. అయితే, అప్పట్లో పర్సనల్ పనులు అనుకున్నా.. రాజకీయం కారణం ఉందనేది వాస్తవం అంటూ.. వార్తలు వచ్చాయి.
దీనికి బలం చేకూరుతున్నట్టుగా డీకే సతీమణి.. సత్యప్రభ కూడా తాజాగా జగన్‌తో భేటీ కావడం రాజకీయంగా ఆ కుటుంబం ఇక, సైకిల్ దిగిపోతుందనే వాదన నిజమేనని అంటున్నారు పరిశీలకులు. నిజమే.. ఎన్నాళ్లని ఎదురు చూస్తారు. ఎప్పటి నుంచో తన కుమారుడికి లైఫ్ ఇవ్వాలంటూ.. చంద్రబాబును సత్యప్రభ కోరుతున్నారు. పార్టీకి అవసరం వచ్చిన ప్రతిసారీ.. ఆర్థికంగా ఆదుకున్నారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్రకు కూడా నిధులు ఇచ్చారు. అయితే, శ్రీనివాస్ విషయంలో చంద్రబాబు శీతకన్నేశారు.
అంతేకాదు, గత ఏడాది ఓటమి తప్పదని తెలిసి కూడా రాజంపేట నియోజకవర్గం ఎంపీ టికెట్‌ను సత్యప్రభకు కట్టబెట్టారు. వద్దని ఆమె వారించినా.. బాబు బలవంతం చేశారు. ఈ పరిణామాలతో ఆ కుటుంబం టీడీపీకి దూరంగా ఉంటూ వస్తోంది. ఇక, ఎన్నాళ్లయినా.. చంద్రబాబు నిర్ణయం తీసుకోక పోవడం, మరోపక్క, జగన్ దూకుడు ఎక్కువగా ఉండడంతో ఇక, ఆలస్య చేయడం మంచిది కాదని సత్యప్రభ ఫ్యామిలీ పార్టీ మారేందుకు రెడీ అయింది. అయితే, వైసీపీలోకి వస్తే.. ఆమెకు రాజ్యసభ లేదా ఆమె కుమారుడికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.